ప్రజల్లో వ్యతిరేకత.. లోకల్ బాడీ బైఎలక్షన్లకు వెనుకడుగు

ప్రజల్లో వ్యతిరేకత..  లోకల్ బాడీ బైఎలక్షన్లకు  వెనుకడుగు
  • రాష్ట్రంలో 215 సర్పంచ్, 92 ఎంపీటీసీ, 3 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీ 

హైదరాబాద్, వెలుగు : వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్​ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. ఏడాదిగా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడినా బై ఎలక్షన్స్ నిర్వహణను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోసం చేయాల్సిన ఫార్మాలిటీస్​ నెల రోజుల క్రితమే పూర్తి చేసింది. కానీ  సర్కారు తేదీలు ప్రకటించడం లేదు. ప్రభుత్వ పనితీరుపై ఫీల్డ్ లెవల్ లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్లే ఎన్నికలకు వెళ్లేందుకు సాహసించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మినీ పోరులో ప్రతికూల ఫలితాలు వస్తే.. ఈ ఎఫెక్ట్ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఉండొచ్చనే అనుమానంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. 

215 గ్రామాలకు సర్పంచ్​లు లేరు 

రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగి మూడేండ్లు దాటుతోంది. ఎన్నికైన అభ్యర్థులు కొందరు చనిపోవడం, ఎన్నికల ఖర్చుల లెక్కలు సమర్పించకపోవడం వల్ల అనర్హత వేటు పడడం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 215 సర్పంచ్ స్థానాలతోపాటు 92 ఎంపీటీసీ స్థానాలు, 5,337 వార్డు మెంబర్ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆదిలాబాద్, సిద్దిపేట, ములుగు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి చొప్పున ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్​ కమిషన్​(ఎస్​ఈసీ) ఏడాది నుంచే సన్నాహాలు చేస్తోంది. చట్ట ప్రకారం అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు ఓటరు జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పొలిటికల్ పార్టీలతో మీటింగ్​పై మే నెలలో నోటిఫికేషన్​ జారీ చేశారు. మే 7న మొదలైన ఈ పక్రియ మే24తో ముగిసింది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం ఒక్కటే మిగిలినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. 

పీకే రిపోర్ట్ ఎఫెక్టుతోనే.. 

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గత ఆరు నెలలుగా విడతలవారీగా ప్రశాంత్ కిషోర్​ఐపాక్​ టీమ్ తో సర్వేలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీల ప్రభావం పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి అధికార పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక దుబ్బాక, హుజురాబాద్​ అసెంబ్లీ స్థానాలకు జరిగిన బై ఎలక్షన్స్, జీహెచ్​ఎంసీ, వరంగల్​ కార్పొరేషన్​లో చేదు ఫలితాలు కూడా టీఆర్​ఎస్​ పెద్దలను వెంటాడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోని నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రోజూ వివిధ వర్గాల ఆందోళనలు తీవ్రమవుతున్న ఈ సమయంలో రాష్ట్ర సర్కార్​ఎన్నికలకు అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు.