దుబ్బాకలో రసవత్తరం.. వంద ఓటర్లకో ఇన్​చార్జి..

దుబ్బాకలో రసవత్తరం.. వంద ఓటర్లకో ఇన్​చార్జి..

దుబ్బాకలో టీఆర్​ఎస్​ ఇకమతులు

ప్రచారానికి 19 వేల మంది

సిద్దిపేట నుంచీ క్యాడర్​

మంత్రి హరీశ్‌‌‌‌రావు మానిటరింగ్‌‌‌‌

ఇతర పార్టీ నేతలకు గాలం

గులాబీకి దీటుగా ప్రచారానికి రెడీ అవుతున్న బీజేపీ, కాంగ్రెస్​

సిద్దిపేట, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్‌‌, ‌‌గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో సిద్దిపేటలో అనుసరించిన వంద ఓటర్లకో ఇన్‌‌‌‌చార్జి వ్యూహాన్ని దుబ్బాకలోనూ అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 1,97,468 మంది ఓటర్లుండగా, 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఏకంగా 19వేల పైచిలుకు మంది టీఆర్ఎస్‌‌‌‌ నేతలు, కార్యకర్తలను ఇన్‌‌చార్జిలుగా నియమిస్తున్నారు. ఇందులో భాగంగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్​ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌‌‌‌రావు సిద్దిపేట నుంచి పార్టీ క్యాడర్​ను దుబ్బాక రప్పించారు. ఎన్నికల కోడ్​రాక ముందు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పెండింగ్​ పింఛన్ల క్లియరెన్స్, కల్యాణలక్ష్మి చెక్కులు సహా పలు తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్​ పెద్దలు ఇక ఇప్పుడు ఇతర పార్టీ నేతలకు గాలం వేయడం ప్రారంభించారు. గ్రామాలవారీగా ఆపరేషన్​ ఆకర్ష్​ కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకొని విజయంపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీ లీడర్లు గులాబీకి దీటుగా ప్రచారానికి రెడీ అవుతున్నారు.

పోలింగ్‌‌‌‌ పూర్తయ్యేవరకు ఓటర్లతో టచ్ లో..

టీఆర్​ఎస్​ రూపొందించిన మైక్రోప్లాన్​లో భాగంగా దుబ్బాకలో నియమించిన టీఆర్​ఎస్​ ఇన్​చార్జిలు తమకు కేటాయించిన వందమంది ఓటర్ల తో ప్రతిరోజు టచ్ లో ఉంటారు. ఓటర్లతో నిత్యం మాట్లాడటమే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో  వారి ఇండ్లకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తారు. తమకు కేటాయించిన ఓటర్లంతా పోలింగ్‌‌‌‌ రోజు వారి ఓట్లు వేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఇన్​చార్జిలకే అప్పగిస్తున్నారు. ప్రచార సమయంలో వంద ఓటర్లకు సంబంధించిన పూర్తి అవసరాలను ఇన్‌‌చార్జిలే పర్యవేక్షిస్తారు. ఈ విధానం వల్ల పోలింగ్‌‌ ‌‌శాతాన్ని పెంచడంతోపాటు తమకు అనుకూలంగా ఓటింగ్‌‌‌‌ జరిగే వ్యూహంతో టీఆర్ఎస్​ ముందుకుపోతోంది.  ఇందుకు సంబంధించి ఆయా బూత్ లలో వంద మంది  ఓటర్ల వివరాలు, వారి ఫోన్ నంబర్ల జాబితాలను ఇన్‌‌‌‌చార్జిలకు అప్పగించారు. ఇప్పటికే దుబ్బాక మున్సిపాలిటీ, మండల పరిధిలోని గ్రామాల్లో ఇన్‌‌‌‌చార్జిలు రంగంలోకి దిగగా, మిగిలిన మండలాల్లో ఎంపిక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

మంత్రి హరీశ్‌‌‌‌రావు మానిటరింగ్‌‌‌‌

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన ఎత్తుకున్న మంత్రి హరీశ్‌‌‌‌రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌‌ ‌‌వెలువడే వరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పలు పనులకు నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను మండలాల వారీగా ఇన్‌‌‌‌చార్జిలుగా నియమించడమే కాకుండా వారి ఆధ్వర్యంలో  కార్యకర్తలను యాక్టివ్​ చేశారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు.

నేతలకు తాయిలాలు

దుబ్బాకలో టీఆర్​ఎస్ గెలుపు అంత ఈజీ కాదనే ప్రచారం నేపథ్యంలో టీఆర్ఎస్‌‌ ‌‌నేతలు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.  కొద్ది రోజులుగా ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను చేర్చుకోవడంపై దృష్టిపెట్టారు. ఎన్నికలు దగ్గరపడడంతో దీనిని మరింత స్పీడప్​ చేశారు. ముఖ్యంగా మంత్రి హరీశ్​రావు మెదక్‌‌ ‌‌నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతతో కలసి అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు. గతంలో మహబూబ్‌‌‌‌నగర్‌‌ ‌‌జిల్లాలో    రెండు  అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతల ఓటమికి రచించిన వ్యూహాన్నే  దుబ్బాకలో ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా అసంతృప్త నేతలను బుజ్జగిస్తూనే ప్రతిపక్ష పార్టీల నుంచి చేరికలపై అధికంగా దృష్టి సారించడం గమనార్హం.

కాంగ్రెస్..​ గ్రామానికో ఇన్‌‌‌‌చార్జి

దుబ్బాక ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామంటున్న కాంగ్రెస్‌‌ ‌‌పార్టీ గ్రామానికో ఇన్‌‌చార్జిని నియమించనున్నట్టు ప్రకటించింది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మొత్తం 149 గ్రామాలకు ఒక్కో ఇన్‌‌చార్జిని నియమించి ప్రచారం నిర్వహించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఐదుగురు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్‌‌‌‌చార్జీగా నియమించిన టీపీసీసీ గ్రామాలవారీగా జిల్లా ముఖ్యనేతలను ఇన్‌‌చార్జీలుగా నియమించనున్నది. ప్రస్తుతానికి గ్రామాల ఇన్‌‌చార్జీల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాకపోయినా త్వరలోనే జాబితాను వెల్లడిస్తామని కాంగ్రెస్‌‌‌‌ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా దుబ్బాక ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్‌‌ ‌‌పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పనిచేస్తుంటే ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌‌ దీటుగా ప్రచార వ్యూహాలను రూపొందిస్తున్న తీరు ఆసక్తిని కలిగిస్తోంది.

బీజేపీ ‘శక్తి కేంద్రాలు’

టీఆర్ఎస్‌‌ ‌‌మైక్రో ప్లానింగ్‌‌‌‌కు దీటుగా బీజేపీ ప్రచార వ్యూహాలను రూపొందిస్తోంది. రెండు మూడు పోలింగ్​‌‌బూత్‌‌‌‌లకు ఒక్కో శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్‌‌ ‌‌జిల్లాలోని బీజేపీ ముఖ్యనేతలంతా శక్తి కేంద్రాల పరిధిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో 54 , మెదక్‌‌ ‌‌జిల్లా పరిధిలో 12 బీజేపీ శక్తి కేంద్రాలున్నాయి. వీటి  పరిధిలో ప్రచారాలకు ప్రత్యేక టీమ్​లను ఏర్పాటుచేస్తున్నారు. ఐదుగురు సభ్యులుండే  ఈ ప్రచార టీమ్​లు సంబంధిత శక్తి కేంద్రం పరిధిలోని కార్యకర్తలతో కలిసి  ప్రతిరోజు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తాయి. వచ్చే రెండు మూడు  రోజుల్లో శక్తి కేంద్రాల ప్రచార బృందాలను ఎంపిక చేసి ప్రచార రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై దౌల్తాబాద్‌‌‌‌ మండలంలో ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.

For More News..

ఆన్​లైన్‌లోనూ అమ్మాయిలపై వేధింపులు

అసెంబ్లీకి పోటీ చేయకుండానే ఐదుసార్లు సీఎం

దేశంలో రోజూ 10 మందిపై అకృత్యాలు