ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణం

ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణం

హైదరాబాద్‌‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌‌ రెడ్డి గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌ రెడ్డి తన చాంబర్‌‌లో ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీ రూల్‌‌ బుక్స్‌‌తో కూడిన కిట్‌‌, ఐడెంటిటీ కార్డు అందజేశారు. మంత్రులు ప్రశాంత్‌‌ రెడ్డి, కేటీఆర్‌‌, హరీశ్‌‌రావు, జగదీశ్‌‌ రెడ్డి, మహమూద్‌‌ అలీ, పువ్వాడ అజయ్‌‌, ఇంద్రకరణ్‌‌ రెడ్డి పాల్గొన్నారు.

టీఆర్‌‌ఎస్‌‌ లీడర్లకు నో రూల్స్‌‌

దుబ్బాక, హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి నిబంధనల పేరు చెప్పి ఎవరూ లాబీల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న మార్షల్స్.. మునుగోడు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆయన అనుచరులను మాత్రం లోపలికి అనుమతించారు. వందల సంఖ్యలో టీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తలు స్పీకర్‌‌ చాంబర్‌‌ వైపు దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. గంటల తరబడి వారంతా అసెంబ్లీ ఆవరణలో ఉన్నా కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఈటల ప్రమాణ స్వీకారానికి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా కనీసం లాబీల్లోకి అనుమతించలేదు. 

బయటపడ్డ గ్రూపు రాజకీయాలు

కూసుకుంట్ల ప్రభాకర్‌‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డికి ఆహ్వానం అందలేదు. బుధవారం రాత్రి నగరంలోని ప్రముఖ కన్వెన్షన్‌‌ సెంటర్‌‌లో మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేసిన ముఖ్య నాయకులకు ట్రీట్‌‌ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కూడా మండలి చైర్మన్‌‌ ను ఆహ్వానించలేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఇతర ప్రముఖులను ఆహ్వానించి.. తనను మాత్రమే విస్మరించడంపై మండలి చైర్మన్‌‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు తెలిసింది. ఎన్నికలో గెలిచే వరకు ఒకలా, గెలిచిన మరుసటి రోజు నుంచే ఇంకోలా నేతలు వ్యవహరిస్తున్నారని, ఒడ్డుకు చేరిన తర్వాత తెప్పను తగలేసిన విధంగా వీళ్ల పద్ధతి ఉందని తన సన్నిహితుల వద్ద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.