టీఆర్​ఎస్​ దుబ్బాక క్యాండిడేట్​ సోలిపేట సుజాత

టీఆర్​ఎస్​ దుబ్బాక క్యాండిడేట్​ సోలిపేట సుజాత

హైదరాబాద్‌, వెలుగుదుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌‌ఎస్‌ పార్టీ టికెట్‌ను దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. తన తుదిశ్వాస వరకూ రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారని సీఎం ‌ కొనియాడారు. రామలింగారెడ్డి తలపెట్టిన అభివృద్ధి పనులను కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పటిలాగే అమలు కావడానికి ఆయన కుటుంబ సభ్యులే ప్రాతినిథ్యం వహించడం కరెక్ట్​ అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపుల తర్వాతే, సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడంతోపాటు, పార్టీ కోసం కూడా రామలింగారెడ్డి అంకిత భావంతో పనిచేశారని ప్రశంసించారు. నియోజకవర్గ అభివృద్ధిలో రామలింగారెడ్డి కుటుంబమంతా పాల్పపంచుకుందన్నారు.

ముత్యంరెడ్డి ఫ్యామిలీకి మళ్లీ నిరాశే

దుబ్బాక టికెట్‌‌ను సోలిపేట సుజాతకు కేటాయించడంతో, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుటుంబానికి మరోసారి నిరాశే ఎదురైంది. 2018 ఎన్నికలకు ముందు ముత్యంరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్‌‌‌‌.. ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు.ఆ తర్వాత కొంతకాలానికే అనారోగ్యంతో ముత్యంరెడ్డి చనిపోయారు. ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌‌రెడ్డి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఆయనకూ ఏ పదవీ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత శ్రీనివాస్‌‌రెడ్డికే  టీఆర్‌‌‌‌ఎస్‌‌  టికెట్ వస్తుందని భావించారు.  ఆయనకు చివరివరకూ ఆశ చూపిన టీఆర్‌‌‌‌ఎస్  నేతలు.. టికెట్‌‌ను సుజాతకు కేటాయించారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

మాజీ మంత్రి, దివంగత చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌‌రెడ్డిని దుబ్బాక ఉప ఎన్నికల బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం టీఆర్‌‌‌‌ఎస్ లో ఉన్న శ్రీనివాస్‌‌రెడ్డి, సోమవారం కాంగ్రెస్ నాయకులకు టచ్‌‌లోకి వచ్చారు. హైదరాబాద్‌‌లోని ఓ హోటల్‌‌లో కాగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్‌‌ లో చేరి, దుబ్బాక నుంచి పోటీ చేయాలని శ్రీనివాస్‌‌ రెడ్డిని దామోదర రాజనర్సింహ ఆహ్వానించారు. మంగళవారం తన అనుచరులతో భేటీ తర్వాత శ్రీనివాస్ రెడ్డి తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. శ్రీనివాస్‌‌రెడ్డి ఎంట్రీతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నయి. దుబ్బాక ఉప ఎన్నికల సమీక్షలోనూ నర్సారెడ్డి పేరునే ఖరారు చేశారు. కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.