కాంగ్రెస్ నుంచి చేరినోళ్లకు ఎట్ల టికెటిస్తరు? ఒంటిపై కిరోసిన్ పోసుకున్న మాజీ కౌన్సిలర్ భర్త

కాంగ్రెస్ నుంచి చేరినోళ్లకు ఎట్ల టికెటిస్తరు? ఒంటిపై కిరోసిన్ పోసుకున్న మాజీ కౌన్సిలర్ భర్త

మెదక్, మెదక్​టౌన్, వెలుగు: మున్సిపల్​ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్​పార్టీలో టికెట్ల లొల్లి షురువైంది. సిట్టింగ్ నైన తనకు పార్టీ టికెట్​ఇవ్వకుండా కాంగ్రెస్​నుంచి చేరినవారికి కేటాయించడంతో తాజా మాజీ మహిళా కౌన్సిలర్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఆమె భర్త ఒంటిపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలో చోటుచేసుకుంది.

మున్సిపల్​ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్​పార్టీ క్యాండిడేట్ల ఫస్టు లిస్టును బుధవారం సాయంత్రం మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి విడుదల చేశారు. 32వ వార్డు స్థానంలో టీఆర్ఎస్ క్యాండిడేట్​గా బుధవారం సాయంత్రమే కాంగ్రెస్​ పార్టీ నుంచి టీఆర్ఎస్​లో చేరిన గోదల సాయిరామ్​ భార్య మానసను ప్రకటించారు. దీంతో ఆ వార్డు స్థానంలో టీఆర్ఎస్​పార్టీ టికెట్​ఆశించిన తాజా మాజీ కౌన్సిలర్​ గోదల జ్యోతి తీవ్ర నిరాశకు గురయ్యారు.

విషయం తెలియగానే జ్యోతితో పాటు ఆమె భర్త గోదల కృష్ణ అనుచరులతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్​గా గెలిచిన తాను టీఆర్ఎస్​లో చేరి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి విజయానికి కృషి చేశానని, ఇప్పుడు తనకు కౌన్సిలర్​ టికెట్​ ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ కంటతడి పెట్టారు. తమకు పార్టీ టికెట్​ ఇవ్వకుంటే భార్యభర్తలిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని కృష్ణ బయటకు వెళ్లి కిరోసిన్​ తీసుకునివచ్చి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద ఒంటిపై పోసుకొన్నాడు.

ఇది గమనించిన అక్కడున్న పార్టీ కార్యకర్తలు, అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని సముదాయించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వార్డు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు పార్టీ కోసం పని చేస్తే తమకు అవకాశం ఇవ్వకుండా ఈ రోజే పార్టీలో చేరిన వారికి టికెట్​ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  టౌన్​ సీఐ  వెంకట్​ఆత్మహత్యకు యత్నించిన కృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు.