నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ, జిల్లా నుంచి వెనక్కి తరలించిన ప్రభుత్వ విద్యాసంస్థలను, కార్యాలయాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) భారీ ధర్నా నిర్వహించింది.
మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో పార్టీ జెండా ఆవిష్కరించి, అనంతరం కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని, ఎస్పీ కార్యాలయ నిర్మాణాన్ని యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్‌లో ఉన్న పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయాన్ని, పాలమూరులో ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయాన్ని తక్షణమే నారాయణపేటకు తరలించాలని కోరారు. రైతు భరోసా నిధులు వెంటనే జమ చేయాలని, రోడ్డు రిపేర్లు వేగవంతం చేయాలని అధికారులను కోరుతూ కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్ రావు, కృష్ణ కిషోర్, కొడంగల్ ఇన్చార్జి నీలి జనార్దన్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
