- జెండా గద్దె నమూనాను ఆవిష్కరించిన పార్టీ చీఫ్ కవిత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్‌లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెలు నిర్మిస్తున్నామని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం నుంచి నెల రోజుల పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో జెండా పండుగను నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో ఆమె జెండా గద్దెల మోడల్‌ను ఆవిష్కరించారు.
మూడు అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని పార్టీ నేతలకు కవిత సూచించారు. పార్టీ జెండా గద్దె బేస్ (అడుగు భాగం) ఒక అడుగు ఎత్తులో ఉంటుందని, పైభాగం మరో రెండు ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. జెండా గద్దె బేస్‌కు ఆకుపచ్చ రంగు, పైభాగంలో ఉండే గద్దెకు పసుపు రంగు, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ నీలం రంగులో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లిష్ అక్షరాల్లో 'టీఆర్ఎస్' అని రాయాలని చెప్పారు. అలాగే, జెండా గద్దె బేస్ ఆకుపచ్చ రంగు మధ్యలో తెలుగులో 'తెలంగాణ రక్షణ సేన' అని రాయాలన్నారు. పార్టీ జెండా కలర్ కోడ్స్‌ను తాము ఇచ్చిన విధంగానే చూసుకోవాలని, అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈనెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు జెండా పండుగను నిర్వహించాలని క్యాడర్‌కు కవిత పిలుపునిచ్చారు.
