టీఆర్ఎస్ ‘గ్రేటర్ ’ప్లాన్.. రంగంలోకి దిగిన కేటీఆర్

టీఆర్ఎస్ ‘గ్రేటర్ ’ప్లాన్.. రంగంలోకి దిగిన కేటీఆర్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కంప్లీట్ చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచన
పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు
బడ్జెట్ సమావేశాల్లోనే జీహెచ్ఎంసీకి కొత్త చట్టం
అసెంబ్లీ తర్వాత మంత్రి కేటీఆర్ బస్తీ యాత్రలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌పై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే ప్లాన్ చేస్తోంది. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లతో పాటు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను పరుగులు పెట్టిస్తోంది.

గ్రేటర్ ఎన్నికలే టార్గెట్
జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. పంచాయతీ, మున్సిపల్, సహకార ఎన్నికలు కంప్లీటై జీహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రమే మిగలడంతో.. ఈ ఎలక్షన్లను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మున్సిపల్ శాఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తుండటం.. గ్రేటర్ ఎన్నికల బాధ్యత ఆయనపైనే ఉండటంతో సిటీలోని టీఆర్ఎస్ లీడర్లంతా అప్రమత్తమయ్యారు. గ్రేటర్ ఎన్నికలు, అభివృద్ధి పనులకు లింక్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సిటీలోని ముఖ్య నేతలకు కేటీఆర్ సూచించారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 6 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులంటున్నారు. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 180కి పెంచే ఆలోచన చేస్తోంది. అడ్వాన్సుగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం జరుగుతోందని, అందుకే అభివృద్ధి పనుల హడావుడి మొదలైందనే చర్చ జరుగుతోంది. పంచాయతీ, జెడ్పీ, మున్సిపల్, సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహిస్తే అదే రిజల్ట్​ వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు నిర్వహించినా.. పాలకవర్గ పదవీకాలం ముగిసేంత వరకు గెలిచిన వారు వెయిట్ చేయాల్సి ఉటుందని, అందువల్ల నిర్ణీత గడువులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

దసరా నాటికి పనులు పూర్తి
జీఎచ్ఎంసీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది. ఇందుకు కావాల్సిన నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్టు తెలిసింది. గ్రేటర్‌లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల పనులు పూర్తయి అందుబాటులోకి రాగా, మిగతా చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కేటీఆర్ సిటీలో ఆకస్మిక తనిఖీలు చేయడం ఇందులో భాగమని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ పరిధిలో ఒకే రోజు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో గ్రేటర్ పరిధిలో లక్ష ఇండ్లు మంజూరయ్యాయి. ఈ లక్ష ఇండ్ల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆధికారులకు ఆదేశించారు. 98 వేల ఇండ్ల పనులు 70% పూర్తయ్యాయి. మిగతా పనులను వెంటనే పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు.

కేటీఆర్ బస్తీ యాత్రలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత మంత్రి కేటీఆర్ బస్తీ యాత్రలు చేపట్టనున్నారని తెలిసింది. ఈ యాత్రల్లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థా పనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇకపై కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా నగరాలు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు విడుదల చేయనుంది. ఈ నెల నుంచే ఈ నిధులు రిలీజ్​ కానున్నాయి. ఇందులో రూ.78 కోట్లను జీహెచ్ఎంసీ అభివృద్ధికే కేటాయించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.