
Wegovy: ప్రస్తుత కాలంలో భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అంశం ఊబకాయం. అధిక బరువు అనేక సమస్యలకు కారణంగా మారిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్న వేళ దానికి పరిష్కారాలు కూడా అంతే వేగంగా వచ్చేస్తున్నాయి. నొప్పిలేకుండా బరువు తగ్గాలనుకునే చాలా మందికి ఈ డ్రగ్స్ సులువైన ఎంపికలుగా మారుతున్నాయి.
డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్ బరువు తగ్గాలనుకునే వ్యక్తులకు వెగోవీ పేరుతో ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి ఇవి భారత మార్కెట్లోని ఫార్మసీల్లో అందుబాటులోకి రాబోతున్నాయని కంపెనీ వెల్లడించింది. ఇంజక్షన్ల రూపంలో ఉండే ఈ మందు మెుత్తం 5 డోసులుగా వారానికి ఒకటి చొప్పున తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మెుదటి వారం నుంచి ప్రారంభమై 0.25 mg, 0.5 mg, 1 mg, 1.75 mg, 2.4 mg చివరికి తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఇక ధరల విషయానికి వస్తే మెుదటి నెలలో వాడే 0.25 mg, 0.5 mg,1 mg డోసేజీల మెుత్తం విలువ రూ.17వేల 345గా కంపెనీ నిర్ణయించింది. దీని తర్వాత 1.75 mg రేటు రూ.24వేల 280గా.. ఇక చివరిగా 2.4 mg డోసు ధర రూ.26వేల 050గా నిర్ణయించబడింది. అంటే సగటున వారానికి ఇంజక్షన్లకు రూ.4వేల 366గా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
డ్రగ్ డోసేజీ వినియోగం ఇలా..
ఒక్కో డోసును నాలుగు వారాల పాటు తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఉదాహరణకు 0.25 ఎంజీని నాలుగు వారాలు తీసుకున్న తర్వాత మరో నెల అంటే నాలుగు వారాలు 0.5 ఎంజీ డోసును పేషెంట్ కి అందాస్తారు. దీని తర్వాత 1 ఎంజీ చొప్పున ఒక నెల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డోసేజీ తర్వాత డ్రగ్ ఏ మోతాదులో అందించాలనే విషయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారని కంపెనీ చెబుతోంది. మందు పేషెంట్ పై చూపుతున్న ప్రభావం ఆధారంగా డోస్ పెంచాలా లేక తగ్గించాలా అనే నిర్ణయాన్ని వైద్యులు తీసుకుంటారని కంపెనీ చెబుతోంది.
దీర్ఘకాలిక బరువు నిర్వహణ, హృదయ సంబంధ వ్యాధులకు వెగోవీ మొదటి అలాగే ఏకైక వెయిట్ మేనేజ్మెంట్ డ్రగ్ అని కంపెనీ చెబుతోంది. కంపెనీ తన మందును ప్రస్తుతానికి భారతదేశంలో స్థానికంగా తయారు చేసే ఎలాంటి ప్రణాళికను కలిగి లేదని చెప్పింది. అయితే ఇలాంటి మందులు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవటం మాత్రమే మంచిది.