Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మూడినట్టే.. జులై మొదటి వారంలో భారీగా ఉద్యోగాల ఊచ కోత

Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మూడినట్టే.. జులై మొదటి వారంలో భారీగా ఉద్యోగాల ఊచ కోత

టెక్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. వచ్చే వారం అంటే జులై తొలి వారంలో గత 18 నెలల్లో ఎన్నడూ లేనంత లేఆఫ్స్కు.. అదేనండీ ఉద్యోగుల తొలగింపునకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ తన వీడియో గేమింగ్ బ్రాండ్ అయిన Xboxలో ఉద్యోగాల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ ప్రకటించడం గత 18 నెలల వ్యవధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఎంతమంది ఉద్యోగాలకు గండం ఉందనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ బయటపెట్టనప్పటికీ భారీగానే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని తెలిసింది.

2023లో 69 బిలియన్ డాలర్లతో అమెరికన్ వీడియో గేమ్ హోల్డింగ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లాభాల కోసం మైక్రోసాఫ్ట్ పలు స్ట్రాటజీలను అమలు చేస్తోంది. ఇందులో లేఆఫ్స్ ఒకటి. లాభార్జన కోసం ఒత్తిడి పెరగడంతో ఇక లేఆఫ్స్ ఒక్కటే తక్షణ కర్తవ్యమని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. 2024 జనవరిలో 1900 మంది ఉద్యోగులను యాక్టివిషన్ బ్లిజార్డ్, ఎక్స్ బాక్స్ నుంచి మైక్రోసాఫ్ట్ పీకేసింది.

మే 2025లో పలు డివిజన్లలో పనిచేస్తున్న 6 వేల మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ ఈ లేఆఫ్స్లో భాగంగా ఇంటికి పంపించేసింది. జూన్ 2025లో ఇప్పటిదాకా 300 మందికి పైగా ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ జాబ్స్ నుంచి తొలగించింది. గత సంవత్సర కాలంగా చూసుకుంటే.. మైక్రోసాఫ్ట్ కంపెనీ 10 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టబోతున్న లేఆఫ్స్ రౌండ్లో మైక్రోసాఫ్ట్ ఇంతకు మించి ఉద్యోగులను ఇంటికి పంపించబోతున్నట్లు సమాచారం.