బీజేపీ స్పీడ్​ను ఆపేందుకు టీఆర్​ఎస్​  గేమ్​ ప్లాన్​

బీజేపీ స్పీడ్​ను ఆపేందుకు టీఆర్​ఎస్​  గేమ్​ ప్లాన్​
  • ప్రగతి భవన్​లో కాంగ్రెస్​ లీడర్లు
  • సీఎల్పీ లీడర్​ భట్టికి స్వయంగా ఫోన్​ చేసి ఆహ్వానించిన కేసీఆర్
  • కాంగ్రెస్​ను ఎంకరేజ్​ చేసేందుకు మొదటిసారి అపాయింట్​మెంట్

హైదరాబాద్​, వెలుగు: తొలిసారిగా ప్రగతిభవన్​ గేట్లు తెరిచారు. ఇంతకాలం మంత్రులకే అపాయింట్​మెంట్​ఇవ్వని సీఎం కేసీఆర్.. అనూహ్యంగా కాంగ్రెస్​ నేతలకు అపాయింట్​మెంట్​ ఇచ్చారు. కాంగ్రెస్​ నేతలను కలిసేది లేదని, అసలు ఎంట్రీ లేదని పలుమార్లు తిరస్కరించిన ఆయన.. ఇప్పుడు సడెన్​గా వారిని దగ్గరకు తీయటం రాజకీయ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కేసీఆర్​ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఖతం పట్టించారు. ఎన్నికల్లో గెలిచిన 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అదే కేసీఆర్​ కాంగ్రెస్​ నేతలను ఆహ్వానించి, దళిత మహిళ మరియమ్మ లాకప్​ డెత్​పై చర్చించటం హాట్​ టాపిక్​గా మారింది. జానారెడ్డి సీఎల్పీ నేతగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేల బృందం గడిచిన ఏడేండ్లలో దాదాపు ఇరవై సార్లు సీఎం అపాయింట్​మెంట్​ కోరింది. 

ప్రతి సందర్భంలోనూ తిరస్కరించిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలను పిలిపించుకొని మాట్లాడటం చర్చకు తెరలేపింది. సీఎం స్వయంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్​ చేసి ప్రగతిభవన్​కు రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీ స్పీడ్‌‌ పెంచింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవటంతో పాటు జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టీఆర్​ఎస్ కు షాకిచ్చింది. హుజూరాబాద్​లో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్​ను పార్టీలో చేర్చుకోవటంతో పాటు హుజూరాబాద్​లో ఆయన గెలుపు కోసం ఇప్పట్నుంచే బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. ఈ టైమ్​లో కాంగ్రెస్​ను దగ్గరకు తీయడం ద్వారా  బీజేపీకి చెక్ పెట్టినట్లు అవుతుందనేది కేసీఆర్​ గేమ్​ ప్లాన్. అందుకే కాంగ్రెస్​ నేతలను రప్పించుకున్నట్లు తెలుస్తోంది. మరియమ్మ లాకప్​ డెత్​కు సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకొని..  దళితుల నుంచి వస్తున్న వ్యతిరేకతను చల్లార్చటంతో పాటు రాజకీయంగా కలిసొచ్చేందుకు  కాంగ్రెస్​ ను కేసీఆర్​ ఎంకరేజ్​ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. కాంగ్రెస్, టీఆర్​ఎస్​కు  బీ టీమ్​గా పని చేస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

వెళ్లారా? పిలిపించుకున్నారా?
సీఎల్పీ నేతలు ప్రగతి భవన్​కు అపాయింట్​మెంట్​ మీద వెళ్లారా? లేదా సీఎం పిలిపించుకున్నారా?.. అనేది చర్చనీయాంశమైంది. ఏడేండ్లలో కాంగ్రెస్​ నేతల్ని కలవడానికి ఇష్టపడని కేసీఆర్​ ఇప్పుడెలా అవకాశం ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. సీఎంను కలిసిన సీఎల్పీ బృందంలోని నేత ఒకరు.. తాము మూడ్రోజుల కింద అపాయింట్​మెంట్​ కోరామని చెప్తున్నారు. గతంలో తమకెప్పుడూ ఆహ్వానం రాలేదని, ఇప్పుడు అపాయింట్​మెంట్​ ఇవ్వడంతో ఆశ్చర్యపోయామంటున్నారు. కాంగ్రెస్​లోని మరికొందరు నేతలు వేరే కథనం వినిపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్, సీఎం దళిత్​ ఎంపవర్​మెంట్​ ప్రోగ్రామ్​కు సంబంధించి ఆ వర్గ ప్రజాప్రతినిధులతో భేటీ కావాలని భావించిన సీఎం కేసీఆర్ భట్టి విక్రమార్కకు ఎప్పుడు వీలవుతుందో ఆరా తీయాలని సీఎంవో అధికారులను పురమాయించినట్లు సమాచారం. సీఎంవో నుంచి ఫోన్​ వెళ్లినప్పుడు భట్టి.. తన నియోజక వర్గంలో దళిత మహిళ మరియమ్మకు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించి, ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు ఎందుకు అపాయింట్​మెంట్​ ఇవ్వరని నిలదీసినట్లు తెలిసింది. విషయం సీఎం దృష్టికి తీసుకుపోతామన్న సీఎంవో అధికారులు తర్వాత అపాయింట్​మెంట్​ కన్​ఫర్మ్​ చేసినట్లు సమాచారం. కేసీఆర్​ ఈలోపు సంబంధిత అధికారులతో మాట్లాడి అందరినీ పిలిపించుకున్నట్లు తెలిసింది. భట్టికి అపాయింట్​మెంట్​ ఖరారు కావడంతో ఆయన అందుబాటులో ఉన్న సభ్యులతో కలిసి ప్రగతి భవన్​ వెళ్లినట్లు కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి. ఇన్నేండ్లలో ఎన్ని సార్లు అపాయింట్​మెంట్​ కోరినా సీఎం స్పందించలేదని, నేరెళ్ల ఘటన మొదలు అనేక అంశాల్లో దళితులపై దాడులు జరిగినప్పుడు సీఎంను కలవాలని ప్రయత్నించామని వాళ్లు గుర్తు చేస్తున్నారు. కొన్ని సంఘటనల్లో సీఎంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే ప్రగతి భవన్​ ముట్టడి చేసి అరెస్టయిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏడేండ్లలో ఎప్పుడూ కాంగ్రెస్​ను పట్టించుకోని సీఎం ఇప్పుడు ప్రగతిభవన్​కు పిలవడం, సీఎల్పీ నేత వెంటనే వెళ్లడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కోసమే పిలిచిండు
కేసీఆర్​కు బీజేపీ భయం పట్టుకున్నది. ఈటల గెలుస్తడనే సమాచారం ఉన్నది. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కాంగ్రెస్​ నేతలను ప్రగతిభవన్​కు పిలిపించిండు. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్​కు బుద్ధి చెప్తరు.
‑ బీజేపీ నేత వివేక్​ వెంకటస్వామి

టీఆర్​ఎస్​ బీ టీమ్​ కాంగ్రెస్​
కాంగ్రెస్ ను తాకట్టు పెట్టేందుకే సీఎల్పీ నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​కు బీ టీమ్‌గా కాంగ్రెస్ పని చేయనుంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్న వీహెచ్ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.
‑ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు