టీఆర్ఎస్ సర్కార్ గద్దె దిగడం ఖాయం

టీఆర్ఎస్ సర్కార్  గద్దె దిగడం ఖాయం

బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నరు: తరుణ్​ చుగ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్  అన్నారు. కేసీఆర్​పై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ‘‘కేంద్రంలో బీజేపీ పాలనలో, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఎవరేం చేశారో ప్రజల్లోకి వెళ్దామా” అని కేసీఆర్​కు సవాల్ విసిరారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ ఆఫీసు బేరర్ల మీటింగ్ జరిగింది. దీనికి తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

‘కేసీఆర్ ముక్త్ 

తెలంగాణ’ను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపా రు. రాష్ట్ర రైతులను కేసీఆర్​ మోసం చేశారని,  వడ్లను కొనకుండా బాధ్యతల నుంచి తప్పించుకున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ‘‘డబుల్ బెడ్రూం ఇండ్లు  ఇచ్చారా.. ఉద్యోగాలిచ్చారా.. బంగారు తెలంగాణ ఏమైంది?” అని ప్రశ్నించారు. 

తెలంగాణలో ప్రజలు ఆత్మగౌరవం లేకుండా బతికే దుస్థితి వచ్చిందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయని, 2023లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కథ ముగుస్తుందన్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు ఆసక్తి చూపిస్తున్నారని,  చేరికలపై రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా, మండల స్థాయిలో కమిటీలను నియమించుకొని ఆయా నేతలను పార్టీలోకి  తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కలిసికట్టుగా పనిచేయాలి

‘దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్’ ఇదే బీజేపీ నినాదమని తరుణ్​ చుగ్​ చెప్పారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారని అభినందించారు. పార్టీ నేతలంతా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు.  బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ పటిష్టతపై నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆందోళనలు, నిరసనలు ఎక్కడికక్కడే చేసేలా స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పని విభజన చేసుకోవాలని సూచించారు. 

మోడీ పాలనపై ఈ నెల 30 నుంచి కార్యక్రమాలు 

మోడీ 8 ఏండ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలకు చుగ్​ పిలుపునిచ్చారు.  మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు దేశంలో సుపరిపాలనపై ఈ నెల30 నుంచి జూన్ 14 వరకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడప గడపకు వెళ్లి మోడీ పాలన తీరును, అవినీతికి తావులేకుండా  భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషిని వివరించాలని సూచించారు. 

సీఎం తీరును ఎండగట్టాలె: సంజయ్

సీఎంగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును బీజేపీ కార్యకర్తలు ఎండగట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు కేసీఆర్ పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో అసలు ఆత్మహత్యలే లేవన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ‘‘కేసీఆర్.. కేంద్రంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని చూసి జనం అసహ్యించుకుంటున్నరు. సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నయ్​. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నడు” అని సంజయ్​ అన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్  సందర్భంగా మూడో విడత పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. 

వచ్చే నెల 23 నుంచి మూడో విడత పాదయాత్ర

వచ్చే నెల 23 నుంచి జులై 12 వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోగా నాలుగో విడత పాదయాత్ర చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. మూడు, నాలుగు విడతల్లో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రతి నెలా 20 రోజుల పాటు పాదయాత్ర చేయాలని, మరో 10 రోజులు వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీ ఆదేశించినట్లు సమావేశంలో ప్రకటించారు. పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత వహించగా.. తరుణ్ చుగ్, శివ ప్రకాశ్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నేతలు లక్ష్మణ్​, మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి, వివేక్ వెంకటస్వామి, మంత్రి శ్రీనివాస్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, నేతలు జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తండ్రీకొడుకుల పాలనపై విశ్వాసం పోయింది: కిషన్ రెడ్డి

రాష్ట్రంలో తండ్రీకొడుకుల పాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని, అందుకే వారు రాష్ట్రంలో లేకుండా తిరుగుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు వంద మంది కేసీఆర్​లు వచ్చినా మోడీని ఏమీ చేయలేరన్నారు. ‘‘నీకు పట్టం కట్టింది తెలంగాణను బాగు చేసేందుకు. కానీ, ఇక్కడి రైతులను ఆదుకోకుండా పంజాబ్ రైతులకు సాయం చేయడమేంటి?” అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం అమరులైన వారిని ఆదుకోలేని కేసీఆర్ పంజాబ్ వెళ్లి సహాయం చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ‘‘మీది, మీ కుటుంబం చేసేది చిల్లర రాజకీయాలు, ఎవరివి చిల్లర రాజకీయాలో మీ పార్టీ సర్పంచ్ లను అడగండి చెప్తారు” అని కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నాయకత్వం లేని పార్టీ కాంగ్రెస్ అని, కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించి వేస్తామన్నారు. బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు.