గ్రేటర్ గిఫ్ట్​లు ..జీహెచ్​ఎంసీలో ఓట్ల కోసం టీఆర్​ఎస్​ తాయిలాలు

గ్రేటర్ గిఫ్ట్​లు ..జీహెచ్​ఎంసీలో ఓట్ల కోసం టీఆర్​ఎస్​ తాయిలాలు
  • దుబ్బాక బైపోల్ ఓటమితో గులాబీ నేతల అలర్ట్​
  • జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించడంపై నజర్
  • ఎలక్షన్​ షెడ్యూల్ ప్రకటనకు ముందే హడావుడి

దుబ్బాక బై ఎలక్షన్​లో ఓటమి.. జీహెచ్ఎంసీలో మళ్లీ రిపీట్​ కావొద్దని టీఆర్ఎస్​ భావిస్తోంది. అందుకే మొదటి నుంచీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జనం ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. భారీ వర్షాలు, వరదల నుంచి కొన్ని ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. వరద సాయం ఇచ్చామని సర్కారు చెప్తున్నా.. చాలాచోట్ల తమకు అందలేదంటూ బాధితులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకో దిక్కు టీఆర్​ఎస్​ కార్పొరేటర్లపైనా జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు దుబ్బాక గెలుపుతో జోష్​లో ఉన్న బీజేపీ ఉత్సాహంగా జీహెచ్ఎంసీ బరిలోకి దిగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్​ జాగ్రత్త పడుతోంది.

హైదరాబాద్, వెలుగు: దుబ్బాక బైపోల్​ దెబ్బతో టీఆర్ఎస్​ పార్టీలో టెన్షన్​ మొదలైంది. త్వరలో జరిగే గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీహెచ్ఎంసీ) ఎలక్షన్లలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎలాగన్న ఆందోళనలో పడింది. సర్కారుపై జనంలో పెరిగిపోయిన వ్యతిరేకత, దుబ్బాక ఎఫెక్ట్​ నుంచి తప్పించుకునేందుకు అన్ని దారులు వెతుకుతోంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తోంది. ఇంటి పన్నులో 50 శాతం రాయితీ, మరో లక్ష కుటుంబాలకు వరద సాయం వంటి హామీలు ఇచ్చింది. ఇదే టైంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న కులాలను, నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్​ పోస్టులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్​ పదవుల్లో నియామకాలు చేసింది. గ్రేటర్  హైదరాబాద్​లో 74 లక్షల ఓటర్లు ఉండగా.. సాధారణంగా 50– 55 శాతం వరకు మాత్రమే పోలింగ్​ జరుగుతుంటుంది. బస్తీలు, కాలనీల వాసుల్లో చాలా వరకు ఓట్లేస్తరు. దీంతో టీఆర్ఎస్​ వారిని టార్గెట్ గా చేసుకునే పనిలో పడింది. ఎల్ఆర్ఎస్​ చార్జీల్లో తగ్గింపు వంటివి కూడా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

త్వరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్  షెడ్యూల్ రానుండటం, బీజేపీ మంచి ఊపు మీద ఉండటంతో.. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అధికార టీఆర్ఎస్​ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రజలంతా దీపావళి పండుగ చేసుకుంటున్న టైంలోనే.. మున్సిపల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం బిజీ అయ్యారు. రాష్ట్ర చీఫ్​ సెక్రెటరీతో భేటీ అయి.. ఆస్తిపన్ను చెల్లింపులో ఏకంగా సగం మేర రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట సహా పలు మున్సిపాలిటీల ఎలక్షన్లు ఉండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను చెల్లింపు రాయితీ వర్తింపజేశారు. ఇక ఇప్పటికే గ్రేటర్​ హైదరాబాద్​లోని నాలుగున్నర లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.450 కోట్లు వరద సాయం అందించామని.. ఇంకో లక్ష కుటుంబాలకు సాయం చేసేందుకు మరో రూ.100 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టులో కేసు కారణంగా బీఆర్ఎస్ పెండింగులో ఉండటంతో దానికి బదులుగా ఎల్ఆర్ఎస్  చార్జీల్లో సడలింపు ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్లకు గాలం వేసేందుకు టీఆర్ఎస్  ప్లాన్​ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్యవైశ్య ఓటర్లకు గాలం వేస్తూ..!

జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్య వైశ్య నేతలు కీలకమే. వాళ్లు ప్రభావితం చేసే ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. హైదరాబాద్ లో సెటిలైన ఉత్తరాది వారితో ఆర్య వైశ్య నేతలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ వర్గం వాళ్లను మచ్చిక చేసుకోవడానికి సీఎం కేసీఆర్​ ఏకంగా మూడు పదవులు ప్రకటించారు. బొగ్గారపు దయానంద్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా.. ఉప్పల శ్రీనివాస్, అమరవాది లక్ష్మీనారాయణలకు కార్పొరేషన్  చైర్మన్ల పదవులు ఇచ్చారు. మరికొందరికి కూడా నామినేటెడ్  పదవులు ఇవ్వడం ద్వారా ఈ వర్గం వారి ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఎంప్లాయీస్​ను ఆకర్షించేలా..

సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంప్లాయీస్​ను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్​ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులకు కరోనా టైంలో కట్ చేసిన 50 శాతం జీతాలను చెల్లించాలని నిర్ణయించింది. ఇదే టైంలో కాంట్రాక్టు లెక్చరర్లపైనా సానుభూతితో ఉన్నామని, వారు వేరే కాలేజీలకు మారడానికి అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 3 డీఏల్లో ఒకటి రిలీజ్​ చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయి.

సీట్లు తగ్గితే ఎక్స్ అఫీషియో అస్త్రం

గ్రేటర్ ఎలక్షన్లలో అనుకున్న స్థాయిలో సీట్లు రాకుంటే ఎక్స్ అఫీషియో ఓట్ల అస్త్రాన్ని ప్రయోగించాలని టీఆర్ఎస్ చూస్తోంది. టీఆర్ఎస్ కు ఎంఐఎంతో కలిపి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ద్వారా 33 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఇంకో ముగ్గురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు. ఇద్దరు రాజ్యసభ సభ్యుల ఓట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 38కి చేరుతాయి. ఒకవేళ సీట్లు తగ్గితే.. ఈ ఓట్లతో జీహెచ్ఎంసీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్​ భావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో టీఆర్ఎస్​ సరిపడా సీట్లు గెలవలేకపోయిన మున్సిపాలిటీలను ఇలాగే ఎక్స్ అఫీషియో ఓట్లతో దక్కించుకుంది.

ప్రాపర్టీ ట్యాక్స్​లో 50 శాతం రాయితీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుకగా ఈ ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్​లో రాయితీ ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్​ శనివారం ప్రకటించారు. జీహెచ్‌‌ఎంసీలో రూ.15 వేల వరకు ట్యాక్స్​ కట్టే వారికి, ఇతర పట్టణాల్లో రూ.10 వేల వరకు ట్యాక్స్​ కట్టేవారికి 50 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల 40 వేల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటికే ప్రాపర్టీ ట్యాక్స్​కట్టిన వారికి వచ్చే ఏడాది రాయితీ ఇస్తామని చెప్పారు. వరద సాయం అందనివారు మీసేవ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అధికారులు సర్వే చేసి రెండు మూడు రోజుల్లో సాయం అందిస్తారని చెప్పారు. జీహెచ్‌‌ఎంసీ శానిటేషన్ వర్కర్ల జీతాన్ని రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నట్టు వెల్లడించారు. నెలకు రూ.8 కోట్లు అదనపు వ్యయం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించగా.. ‘మాకు వచ్చే ఫిబ్రవరి వరకు టైం ఉంది. సరైన టైంలో నిర్ణయం తీసుకుంటం’ అని చెప్పారు.

తాయిలాలు ఇవీ..

  • గ్రేటర్ లో వరద బాధిత కుటుంబాలకురూ. 10 వేల చొప్పున పంపిణీ.
  • మరో లక్ష కుటుంబాలకు పంచేందుకురూ. 100 కోట్లు ఇస్తామని హామీ.
  • ఈ ఏడాదికి ఇంటి పన్నులో 50% రాయితీ.
  • శానిటేషన్ వర్కర్లకు శాలరీ పెంపు .
  • వివిధ కులాలు, నేతలకునామినేటెడ్​ పదవుల ఎర.
  • ఆర్టీసీలో కరోనా టైమ్ లో కట్ చేసిన జీతాల తిరిగి చెల్లింపు .
  • ఇందుకోసం రూ. 120కోట్లు విడుదల చేయాలని నిర్ణయం.
  • కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలుపరిష్కరిస్తామని హామీలు.
  • బస్తీ దవాఖాన్ల ఓపెనింగ్ లు.