టీఆర్ఎస్ ప్లీనరీకి పకడ్బందీ ఏర్పాట్లు

టీఆర్ఎస్ ప్లీనరీకి పకడ్బందీ ఏర్పాట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహ్వానించిన వాళ్లు తప్ప ఇంకెవ్వరూ సభా ప్రాంగణంలోకి రాకుండా బార్‌‌కోడ్‌‌ పాస్‌‌లు జారీ చేశారు. హెచ్‌‌ఐసీసీలో ఏర్పాటు చేసే మెటల్‌‌ డిటెక్టర్‌‌ స్కానర్లు బార్​కోడ్‌‌ను స్కాన్‌‌ చేసిన తర్వాత ఆహ్వానితులు ప్రాంగణంలో అడుగు పెట్టేలా చర్యలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్​పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మేయర్లు, మున్సిపల్‌‌ చైర్​పర్సన్లు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు. ఇన్విటేషన్‌‌ ఉన్న మూడు వేల మందిని మాత్రమే సభకు అనుమతించనున్నారు.  

జాతీయ రాజకీయాలపై విధాన ప్రకటన

నిరుడు అక్టోబర్‌‌ 25న టీఆర్‌‌ఎస్‌‌ ప్లీనరీ వైభవంగా నిర్వహించారు. ఇదే సభలో పార్టీ అధ్యక్షుడికి ఉండే అన్ని అధికారాలను ఆయన అందుబాటులో లేని సమయంలో వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌కు దాఖలు పరుస్తూ కీలక సవరణ చేశారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మళ్లీ ప్రతినిధుల సభ నిర్వహించడానికి జాతీయ రాజకీయాలపై విధాన ప్రకటన చేయడమే కారణమని టీఆర్​ఎస్​  వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబోయే కూటమిలో భాగస్వామ్యం కావాలా.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలా.. అనేదానిపై కేసీఆర్‌‌ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ సభలో ఇదే కీలక తీర్మానమని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, స్త్రీ శిశు సంక్షేమం, ప్రభుత్వ పాలసీలు, రైతుబంధు, బీమా ఇతర అంశాలపై తీర్మానాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం 11 తీర్మానాలు ఇప్పటికే సిద్ధం చేశారు.  తెలంగాణలో మాత్రమే నిరంతరాయంగా కరెంట్‌‌ సరఫరా చేస్తున్నామనే విషయాన్ని ప్రతినిధుల సభ వేదికగా దేశం మొత్తానికి చాటి చెప్పాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.

హైదరాబాద్​ నిండా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు

హెచ్‌‌ఐసీసీ ప్రాంగణంలో జరగనున్న టీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభకు ఇన్‌‌డోర్‌‌ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సెపరేట్‌‌ షెడ్ల మధ్య పార్టిషన్లను తొలగించి ఒకే ప్రాంగణంగా మార్చేశారు. 250 మంది వరకు ప్రతినిధులు కుర్చునేలా భారీ వేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులను వివరిస్తూ మెయిన్‌‌ డయాస్‌‌ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారమే ఆవిర్భావ ఉత్సవం ఉండటంతో సోమవారం ఉదయం నుంచే  హైదరాబాద్​లో గులాబీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌‌లు, పోస్టర్లు, తోరణాల ఏర్పాటు జోరందుకుంది. హైటెక్‌‌ సిటీ నుంచి హెటెక్స్‌‌ కమాన్‌‌, హెచ్‌‌ఐసీసీ ప్రాంతాన్ని గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నింపేశారు. గ్రేటర్​లోని ప్రతి చౌరస్తాలో గులాబీ ఫ్లెక్సీలు, ఫ్లైఓవర్‌‌, మెట్రో రైల్‌‌ ఫిల్లర్లకు హోర్డింగ్‌‌లు ఏర్పాటు చేశారు. ఆవిర్భావ ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ తదితరులు పరిశీలించారు.