పొమ్మంటే పార్టీ నుంచి పోత.. ఇన్ని అవమానాలా?

పొమ్మంటే పార్టీ నుంచి పోత.. ఇన్ని అవమానాలా?
  • నోరు నొక్కుతమంటే కుదురది
  • నన్నడగకుంట ఎవరికి వారే సొంత నిర్ణయాలా? 
  • మంత్రి మల్లారెడ్డి సమక్షంలోనే కామెంట్లు 

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ టీఆర్ఎస్ నేతల విబేధాలు బుధవారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి మీటింగ్ లో బయట పడ్డాయి. తనను సంప్రదించకుండా ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పీర్జాదిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి, కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బుర్ర శివకుమార్ గౌడ్​ సమక్షంలోనే ఆయన ఈ కామెంట్లు చేయడంతో వాతావరణం వేడెక్కింది. ‘‘ఏ కార్యక్రమమైనా చేపట్టే ముందు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, అధ్యక్షున్ని సంప్రదించాలె. కానీ పీర్జాదిగూడ అధ్యక్షున్నయిన నన్ను అడగకుండనే కొందరు సొంత నిర్ణయాలు తీసుకుంటూ అవమానిస్తున్నరు. టీఆర్ఎస్ ప్లీనరీకి నాకు ఎంట్రీ పాస్ కూడా ఇయ్యకుండ మరింత క్షోభ పెట్టిన్రు” అంటూ అన్ని విషయాలూ ఏకరువు పెట్టారు. ఓ దశలో మంత్రి మల్లారెడ్డి వారించినా ఆగలేదు. ‘‘నా నోరు నొక్కే ప్రయత్నం చేస్తే కుదురది. పార్టీలో ఉండుమంటె ఉంటం. వొద్దంటే, మీ కాళ్లు మొక్కి వెళ్లిపోత. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఏ సభలు, మీటింగులు జరిగినా అధ్యక్షున్ని నన్ను పిలవకుండా మేయర్లు, కౌన్సిలర్లు, డిప్యూటీ మేయర్లకే మొదటి ప్రాధాన్యమిచ్చుడు సరికాదు” అన్నారు. తర్వాత అంతా వారిస్తున్నా వినకుండా, అలిగి మీటింగ్ నుంచి వెళ్లిపోయారు.