ఓడిపోతున్నామని సర్వేల్లో వచ్చినందుకే అరాచకాలు

ఓడిపోతున్నామని సర్వేల్లో వచ్చినందుకే అరాచకాలు

ఓడితే.. ప్రభుత్వం కూలిపోతుందని భయం -డీకే అరుణ

కరీంనగర్: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నామని సర్వేల్లో వచ్చినందుకే టీఆర్ఎస్ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సర్వే రిపోర్టులతో టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని.. ఎట్లైనా సరే అరాచకాలు చేసి గెలవాలని అనుకుంటోందని ఆమె విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై దాడికి తెగబడడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కరీంనగర్ లోని తన నివాసంలో దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను ఆమె పరామర్శించారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్నారు. ఎన్నికల కోడ్ లేని సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లలో అప్రజాస్వామికంగా సోదాలు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సొంత సీటును కాపాడుకునేందుకు దురాగతాలు చేస్తోందని ఆరోపించారు.  ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారు.. అందుకే తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని దుబ్బాక ప్రజలను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని విమర్శించారు. ఓడిపోతామని తెలిసి సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు.. ఎందుకోసం తెలంగాణ కోరుకున్నామో అవేవీ నెరవేరలేదు… టీఆర్ఎస్ నియంతృత్వ పోకడను ప్రజలు అర్థం చేసుకున్నారు.. దుబ్బాక ఫలితం 2023 ఫలితాలకు అద్దం పట్టబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పుడు హడావుడి చేస్తున్న టీఆర్ఎస్ నేతలు దుబ్బాకలో కనీస అభివృద్ధి ఎందుకు చేయలేదని డీకే అరుణ నిలదీశారు. కేంద్రం నుంచి డబ్బులు రాలేదని, పొలాల్లో వ్యవసాయ మీటర్లు పెడతారని హరీశ్ రావు పచ్చి అబద్దాలు చెబుతున్నాడు… కేంద్రం నిధులు రాలేదని అర్థిక మంత్రి రాతపూర్వకంగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ కంటే హరీశ్ రావే ఎక్కువ అబద్ధాలు చెబుతున్నాడు.. అబద్దాల్లో వీళ్లకు డాక్టరేట్ ఇవ్వాలని డీకే అరుణ ఎద్దేవా చేశారు. దుబ్బాకలో ఓడి పోతే పరువుపోయి..  ప్రభుత్వం కూలిపోతుందనే భయంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.. నిన్న బండి సంజయ్ పై దాడి సహించలేనిది. సిద్ధిపేట సీపీని సస్పెండ్ చేయాలి… నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఇప్పుడున్న అధికారులందరినీ మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణులంతా దుబ్బాక కార్యక్షేత్రంలోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. దుబ్బాకలో ఆరేళ్లుగా  చేయలేని అభివృద్ధిని ఇప్పుడెలా చేస్తారని ఆమె నిలదీశారు.  అరెస్టు చేసిన బీజేపీ నేతలను, కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.