లిక్కర్​ వెనుక లీడర్లు..పొలిటీషియన్ల కనుసన్నల్లో బ్లాక్ దందా

లిక్కర్​ వెనుక లీడర్లు..పొలిటీషియన్ల కనుసన్నల్లో బ్లాక్ దందా

మంచిర్యాల, వెలుగుకరోనా లాక్​డౌన్​లో మద్యం అక్రమ అమ్మకాలు జోరందుకున్నాయి. అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు తెరవెనుక ఉండి బ్లాక్​ దందాను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 69 వైన్​షాపులు, పది బార్లు ఉన్నాయి. లిక్కర్​ బిజినెస్​లో చాలామంది పొలిటీషియన్స్​కు వాటాలు ఉన్నాయి. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పటికే వైన్స్​, బార్లు ఖాళీ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా తరలించిన మద్యాన్ని కొంతమంది ఏజెంట్ల ద్వారా బ్లాక్​లో అమ్ముతున్నారు. పోలీసులు, ఎక్సైజ్​ ఆఫీసర్లు చూసీచూడనట్లు ఉండాలని పొలిటీషియన్స్​ నుంచి ప్రెజర్​ పెరిగినట్లు తెలిసింది. అందుకే తొలుత దూకుడుగా వ్యవహరించిన టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఇటీవల వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఇప్పటివరకు ఒక్క బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోనే టాస్క్​ఫోర్స్​ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేయడం గమనార్హం. ఈ నెల 1న భీమిని మండల కేంద్రానికి చెందిన ఐత ఆంజనేయులు ఇంట్లో టాస్క్ ఫోర్స్​ పోలీసులు తనిఖీ చేసి రూ.2.60 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దేవాపూర్​కు చెందిన ఏనుగు జైపాల్​రెడ్డి ఇంట్లో ఐదు కాటన్ల బీర్లు లభించాయి. అనంతరం తాండూర్​​ మండలం కొత్తగుడిసెలకు చెందిన ఇడిదినేని లక్ష్మణ్​ వద్ద రూ.10వేల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బోయపల్లి బోర్డు సమీపంలోని గంధ సంతోష్​కు చెందిన రైస్​మిల్లులో 13 కాటన్ల బీర్లను, 24 క్వార్టర్ బాటిళ్లను పట్టుకున్నారు. వీరంతా లాక్​డౌన్​ సమయంలో అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరపాలనే ఉద్దేశంతో కొంతమంది వైన్స్​ నిర్వాహకులతో ఒప్పందం చేసుకొని స్టాక్​ తెప్పించుకున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో వెల్లడించడం గమనార్హం.

వేమనపల్లి వైన్స్​ నుంచి…

ఇటీవల వేమనపల్లి మండల కేంద్రంలోని శ్రీవల్లి వైన్స్ నుంచి సుమారు రూ.20 లక్షల మద్యాన్ని తరలించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమంగా తరలిస్తున్న కొంత మద్యాన్ని కోటపల్లి పోలీసులు పట్టుకున్నారు. దానిని వదిలిపెట్టాలని వారిపై పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ కేసును ఎక్సైజ్ ఆఫీసర్లకు అప్పగించినట్లు సమాచారం. ఈ తతంగం వెనుక జిల్లాలోని ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడు ఈ వైన్స్​లో పార్టనర్​గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రలోభాలకు, బుజ్జగింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. మండల కేంద్రం నడిబొడ్డున ఎంపీడీఓ ఆఫీస్ సమీపం నుంచి లిక్కర్​ తరలిస్తుండగా స్థానిక యువకులు ఫొటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్​ చేయాలని భావించినా సదరు లీడర్​కు భయపడి వెనుకడుగు వేసినట్లు చెప్పుకుంటున్నారు. వైన్స్​కు బయట సీల్​ వేసి ఉండగావెనుక వైపు నుంచి సరుకు తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోటపల్లి మండలం మల్లంపేట వద్ద పట్టుకున్న మద్యం బాటిళ్లకు బార్​కోడ్​ తొలగించి ఉండడంతో అవి ఏ షాపు నుంచి వచ్చాయన్నది విచారణ చేస్తున్నామని, ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్​ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.