ముస్లింలను అధికంగా దోచుకుంది బీఆర్ఎస్ నేతలే : ఎంపీ అర్వింద్

ముస్లింలను అధికంగా దోచుకుంది బీఆర్ఎస్ నేతలే : ఎంపీ అర్వింద్

డబుల్ బెడ్ రూంల నినాదం కేవలం కేసీఆర్ మాయ అని ఎంపీ అర్వింద్ అన్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తదన్న ఆశను ప్రజలు ఇక వదులుకోవాల్సిందేనని చెప్పారు. డబుల్ బెడ్ రూం నిధులు పక్కదారి మళ్లించారని ఆరోపించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ బానిస అన్న అర్వింద్... కేసీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు డబుల్ బెడ్ రూంల నిధులు స్వాహా చేశారన్నారు. కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ పంపిణీలో పక్షపాతం వహించడం సిగ్గు చేటన్నారు.  బాజిరెడ్డి గోవర్ధన్ 4 సార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యాడో ఆర్థం  కావటం లేదని సెటైర్లు వేశారు. బీజేపీ కార్యకర్తలకు సీఎంఆర్ఎఫ్ రావటం లేదు కాబట్టే తన ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యం, పెళ్లిళ్ల కోసం తన ఫౌండేషన్ పని చేస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. కానీ కార్యకర్తలకు అండగా ఉండటమే బీజేపీ నేతల కర్తవ్యమని తెలిపారు. బీజేపీ నేతలు ప్రజల్లో ఉండాలని ఎంపీ అర్వింద్ పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లాకు 8 ఏళ్లల్లో ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ ల పేరుతో ప్రజలను, రైతులను ఆగమాగం చేస్తున్నారని విమర్శించారు. భారత దేశంలో పుట్టిన ప్రతి ముస్లింకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్న ఆయన.. గత 3 ఏళ్లుగా పసుపు పంటకు దుంపకుల్ల వ్యాధి సోకి దిగుమతి తగ్గిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే పసుపు రైతులకు సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎంఐఎస్ పథకం అమలు చేస్తే రైతులకు లాభం చేకూరుతుందన్న ఎంపీ..  కేంద్రానికి పేరొస్తుందనే కేసీఆర్ కేంద్ర పథకాలు అమలు చేయటం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలకు ఓట్లు వేసే బదులు ఇంట్లో కూర్చోవడం బెటర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చారని మండిపడ్డారు. ముస్లింలను అధికంగా దోచుకుంది బీఆర్ఎస్ నేతలేనని విమర్శించారు.