
- కేటీఆర్ చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు మాజీల ప్రయత్నాలు
- కార్పొరేషన్ పదవైనా ఇవ్వాలని కోరుతున్న నేతలు
- కడియం శ్రీహరికి మండలి చైర్మన్ పోస్టు?
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి వినోద్‌కుమార్!
హైదరాబాద్, వెలుగు: నామినేటెడ్ పోస్టుల కోసం టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఆ పార్టీ నేతలు తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ సీటు కావాలని మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టుబడుతుండగా, అది సాధ్యం కాకుంటే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా పలువురు నేతలు చాలా కాలంగా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత కేవలం ఒకే ఒక్క కార్పొరేషన్‌కు మాత్రమే చైర్మన్‌ను నియమించారు. మరో కార్పొరేషన్ పోస్టును భర్తీ చేయబోతున్నట్టు సీఎం స్వయంగా ప్రకటించారు. దీంతో నేతలంతా తమకు చాన్స్ ఇవ్వాలని ముఖ్య నేతలను కోరుతున్నారు.
10 ఖాళీ, 15 కార్పొరేషన్లకు కొత్త ముఖాలు!
మొత్తంగా పది కార్పొరేషన్ల పదవులు ఖాళీగా ఉండగా, మరో పది నుంచి 15 కార్పొరేషన్లకు కొత్త వారిని చైర్మన్లుగా నియమించే అవకాశముంది. రుణ విమోచన కార్పొరేషన్ సహా అనేక కార్పొరేషన్లకు చైర్మన్లు మాత్రమే ఉన్నారు. ఆయా కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టుల్లో మరికొందరిని అకామిడేట్ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. ఖాళీగా ఉన్న సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును తన సొంత జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికిచ్చారు. ఇటీవల జరిగిన పార్టీ జిల్లా ఇన్‌చార్జిల మీటింగ్‌లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు టెస్కో చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓ కీలక నేతకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. లేనిపక్షంలో కమ్మ కులానికి చెందిన మాజీ మంత్రి లేదా ఎమ్మెల్యేల్లో ఒకరికి ఈ పోస్టు ఇచ్చే అవకాశముందని సమాచారం. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి మండలి చైర్మన్ పోస్టు ఇవ్వొచ్చని చెబుతున్నారు. కేబినెట్‌లోకే ఆయనను తీసుకుంటారని ప్రచారం జరిగినా కులం లెక్కల దృష్ట్యా ప్రత్యామ్నాయంగా మరో పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మండలి చీఫ్ విప్ పదవిని గత ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ నేతకు ఇవ్వొచ్చని సమాచారం. బడ్జెట్ సమావేశాల నాటికి మండలి చైర్మన్, చీఫ్ విప్‌తోపాటు అసెంబ్లీ చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేసే అవకాశముంది.
మూడు ఎమ్మెల్సీలు ఖాళీ
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని నేతలకు మండలి స్థానం ఇస్తామని అప్పట్లో సీఎం హామీ ఇచ్చారు. అలాగే పోటీ చేసి ఓడిపోయిన ఒకరిద్దరు నేతలకు ప్రాధాన్యమివ్వాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మండలిలో ప్రస్తుతం మూడు ఖాళీలుండగా, సుప్రీం కోర్టును రాములు నాయక్ ఆశ్రయించడంతో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వొద్దని న్యాయస్థానం ఆదేశించింది. వేటు పడిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి (ఎమ్మెల్యే కోటా), భూపతిరెడ్డి (నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా) కూడా సుప్రీంను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. వీరి స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని సుప్రీం ఆదేశిస్తే ఇప్పట్లో రాష్ట్రంలో మండలి ఎన్నికలుండవు. ఇక ఎమ్మెల్సీ సీటు గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఇస్తామని సీఎం ఇదివరకే ప్రకటించారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇదే తరహా హామీ ఇచ్చి ఉన్నారు. వీరిలో కొందరికి, వారి కుటుంబ సభ్యులకు జెడ్పీ చైర్మన్లుగా అవకాశం దక్కడంతో వారికి మరో పదవి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పదవులు కొన్ని, ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పోటీ ఎక్కువగా ఉంది. అయితే నేరుగా కేసీఆర్, కేటీఆర్‌తో సన్నిహిత
సంబంధాలున్న వారికే పదవుల్లో ప్రాధాన్యం దక్కే అవకాశముందని తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల్లో కొన్నింటిని శ్రావణమాసంలో భర్తీ చేయొచ్చని సమాచారం.