టెన్షన్ వొద్దు.. దేవుడి లాంటి కేసీఆర్ ఆదుకుంటడు

టెన్షన్ వొద్దు.. దేవుడి లాంటి కేసీఆర్ ఆదుకుంటడు
  • ప్రజలపై సీఎం దయాగుణానికి థ్యాం క్స్
  • టీఆర్ ఎస్ నేతలు పబ్లిక్ ను కాపాడుతున్రు
  • ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు, మేయర్,టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌంటర్

హైదరాబాద్, వెలుగుభారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారెవరూ టెన్షన్​ పడొద్దని.. ఆదుకునేందుకు దేవుడి లాంటి సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రులు, మేయర్, టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. నష్టపోయిన వారికి పదివేలు, రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించి సీఎం తన దయాగుణం చూపించారని చెప్పారు. సర్కార్​ను విమర్శించడం తప్ప.. ముంపు ప్రాంత జనానికి ప్రతిపక్షాలు ఏమీ చేయడం లేదన్నారు. వర్షాలు, వరదలపై ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర సర్కార్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​పై చేస్తున్న విమర్శలకు కౌంటర్​గా సోమవారం తెలంగాణ భవన్ లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ ​యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్​, కాలేరు వెంకటేశ్, మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడారు. సిటీ ప్రజలను ఆదుకునేందుకు కేసీఆర్550 కోట్లు మున్సిపల్ శాఖకు విడుదల చేయటంపై థ్యాంక్స్ చెప్పారు.

గత పాలకుల పాపమే: తలసాని

‘టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చినాక అక్రమ కట్టడాలు ఎక్కడా లేవు. 2014 తర్వాత కట్టినవన్నీ చట్టానికి లోబడి ఉన్నయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగితే మొత్తం హైదరాబాద్ మునిగిందని ప్రచారం చేయటం కరెక్ట్​ కాదు. గత పాలకుల పాపమే ఈ పరిస్థితికి కారణం. ప్రజలను ఆదుకునేందుకు దేవుడి లాంటి కేసీఆర్ ఉన్నారు’ అని మంత్రి తలసాని చెప్పారు.

సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి: మహమూద్

హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారన్నారు. మళ్ల మూడు, నాలుగు రోజుల వర్ష సూచన ఉందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

నిద్రపోకుండా కష్టపడుతున్నం: మల్లారెడ్డి

వరదల్లో చిక్కుకున్న  ప్రజల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాత్రి నిద్రపోకుండా కష్టపడుతున్నారన్నారు. చెరువులు తెగడం వల్లే కాలనీలు మునిగాయన్నారు. ఇండ్ల లోకి నీళ్లు వచ్చిన ఏరియాలన్నీ కేటీఆర్ సందర్శించారన్నారు. బాధితులకు రూ.2800 విలువ కలిగిన కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.

ఎవరూ అతీతులం కాదు: మేయర్ బొంతు

భారీ వర్షానికి వేల ఇండ్లు నీళ్లలో మునిగాయని.. ప్రకృతి విపత్తులకు ఎవరూ అతీతులం కాదని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గ్రేటర్ చరిత్రలో ఇంత భారీ వర్షాలు ఎప్పుడూ రాలేదన్నారు. కొన్ని ఏరియాల్లో కనీసం ఫుడ్ పంపిణీ చేసే  పరిస్థితి కూడా లేదన్నారు. ప్రజలను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ అండగా, అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆర్థిక సాయం ద్వారా నగర ప్రజలమీద  కేసీఆర్ చూపిన దయాగుణం అభినందనీయమన్నారు.

ప్రజల కోసం పని చేశాం: దానం నాగేందర్

కాంగ్రెస్, బీజేపీ  నేతలు ప్రచారం కోసం తిరిగారని, తాము ప్రజల కోసం పని చేశామని దానం నాగేందర్ అన్నారు. పేదల కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. వారం నుంచి తాము జనాలను కాపాడే పనిలో ఉంటే బీజేపీ నేతలు మున్సిపల్ ఆఫీస్​ల ఎదుట ధర్నాలు చేశారని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.