వైఎస్ వారసులకు తెలంగాణలో చోటు లేదు

వైఎస్ వారసులకు తెలంగాణలో చోటు లేదు

సంగారెడ్డి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజలను అవమానించారని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఇవ్వడమంటే సిగరెట్, బీడీ ఇవ్వడమా అని వైఎస్ అన్నారని హరీశ్ గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ వారసులమని చెప్పుకుంటూ కొంతమంది వస్తున్నారని.. అలాంటి వారికి తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు లేదని స్పష్టం చేశారు. ప్రచార ఆర్భాటాలను ఈ ప్రాంత ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు వైఎస్ అవమానాలను ఎదుర్కొని కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. 

కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయలేనివి మేం ఏడేళ్లలో చేశాం
‘ఆనాడు కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు కోసం తెలంగాణ ఉద్యమానికి ఎంత ద్రోహం చేశారో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ నుంచి ఇంత భారీగా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే కేసీఆర్ పాలనా తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ డెబ్బై ఏండ్ల పాలనలో చేయలేని అభివృద్ధి పనులను మా సర్కారు ఏడేండ్లలో చేసి చూపించింది. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడి కార్పొరేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 7 మెడికల్ కళాశాలలు వచ్చాయి’ అని హరీశ్ రావు చెప్పారు. 
 
త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
‘కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులు సంగారెడ్డి వచ్చి పూలు చల్లుకొని వెళ్లారు తప్ప ఒక అభివృద్ధి కార్యక్రమానికీ నిధులివ్వలేదు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో చేయని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణా ప్రభుత్వం చేస్తోంది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా సంగారెడ్డి నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు నీళ్లు అందనున్నాయి. 4 వేల కోట్లతో  రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసుకోబోతున్నాం. లక్షా ముప్పై వేల ఉద్యోగాలను తెలంగాణ వచ్చాక ఇచ్చాం. మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నాం’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.