సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి చేదు అనుభవం

సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి చేదు అనుభవం
  • గ్రామంలోకి రాకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా : భూదన్ పోచంపల్లి మండలం దేశముఖ్ గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. రహదారి పనులను ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు సరిగా లేకపోవడంతో స్కూలు బస్సు గ్రామంలోకి రాక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని అడ్డుకున్నారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై పడుతోంది. తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం ద్వారా ఉప ఎన్నికలు జరిగితే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖ్ గ్రామంలో పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు.

తమ నియోజకవర్గం అభివృద్ది జరగాలంటే మునుగోడు ఎమ్మెల్యేలా రాజీనామా చేయాలని  దేశముఖ్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే పనులవుతాయని, వెంటనే రాజీనామా చేయాలని ఆందోళన చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్ రెడ్డి గెలిచాడు. అసెంబ్లీ ఎలక్షన్స్ దాదాపు ఎడాదిన్నర సమయం ఉంది. మరోవైపు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదిస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.