నా నియోజకవర్గానికి నేనే మంత్రి..టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు

నా నియోజకవర్గానికి నేనే మంత్రి..టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు

జనగామ, వెలుగు: ‘‘ఎమ్మెల్యే  అంటే నియోజకవర్గానికి సుపీరియర్​.. నియోజకవర్గానికి తండ్రి లాంటోడు.. నియోజకవర్గానికి మంత్రిలాగ.. నియోజకవర్గానికి ఎవరు రావాలన్నా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిందే” అని స్టేషన్​ ఘన్​పూర్​ టీఆర్​ఎస్  ఎమ్మెల్యే  తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. గ్రూపు రాజకీయాలు చేస్తున్నదెవరో తెలుసని, అలాంటివాళ్లు టీఆర్​ఎస్​ అంటే ఇష్టం లేకుంటే పార్టీ వదిలి వెళ్లి పోవాలని హెచ్చరిస్తున్నానన్నారు. టీఆర్​ఎస్​ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని టీఆర్​ఎస్​ ఆఫీస్​లో రాజయ్య సోమవారం పార్టీ జెండా ఆవిష్కరించారు.  సొంత పార్టీ ముఖ్య నేతలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఎలాంటి గ్రూపు రాజకీయాలు చేయొద్దని అనేక సందర్భాల్లో తెలంగాణ భవన్​ నుంచి  చెప్పారు. ఒక నియోజకవర్గానికి ఎవరు రావాలన్నా.. ఎమ్మెల్సీ, ఎంపీ, జిల్లా పరిషత్​ చైర్మన్​, మంత్రి కావొచ్చు ఎవరైనా సరే ఆ ఎమ్మెల్యే కనుసైగలు.. ఆహ్వానం మేరకు మాత్రమే రావాలి. ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్లయితే తల్లి రొమ్ము కోసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిస్తున్న.. హైకమాండ్​ అన్నీ అబ్జర్వ్​ చేస్తున్నది. ఎవరు గ్రూపులు తయారుజేస్తున్నది పూర్తిగా తెలుసు.. వారిపై కఠిన చర్యలు ఉంటయ్​..’’ అని మండిపడ్డారు.  ఏ పదవులైనా, కాంట్రాక్టు పనులైనా, ఇంకా ఏ ఇతర ప్రపోజల్స్​ అయినా ఎమ్మెల్యే ద్వారానే  పోతాయని చెప్పారు.

వదిలిపెట్టే ప్రసక్తే లేదు

‘‘నేను తీవ్రంగా హెచ్చరిస్తున్న.. పార్టీకి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పార్టీ పదవుల్లో ఉన్నవాళ్లు.. నామినేట్​ పదవుల్లో ఉన్నవాళ్లు.. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న వారిని చూస్తూ సహించేది లేదు” అని రాజయ్య హెచ్చరించారు.  కేటీఆర్​, కేసీఆర్​  నాయకత్వంలో తన  చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తానని, పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదన్నారు. అందరికంటే ముందు రూ . 3 కోట్ల సీడీఎఫ్​ ఫండ్​, రెండున్నర లక్షల జీతం సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఇచ్చానని, కొందరు హైదరాబాద్​కు పోయి ఇస్తున్నారని, అది మహాసముద్రం లెక్క అని పేర్కొన్నారు.