బిల్కిస్ బానో అత్యాచార కేసులో జోక్యం చేసుకోండి

బిల్కిస్ బానో అత్యాచార కేసులో జోక్యం చేసుకోండి

గుజరాత్లో బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషుల విడుదల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీజేఐకు లేఖ రాశారు. 2002 నాటి బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయడంపై భారమైన హృదయంలో లేఖ రాస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 1992 సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం నిందితుల రేమిషన్కు అనర్హత విధించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తాయని అన్నారు. దోషులను స్వాతంత్ర్య దినోత్సవం నాడే విడుదల చేయడం సరికాదని కవిత అభిప్రాయపడ్డారు. 

శిక్ష  విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
బిల్కిస్ బానో అత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు చేసిందని..నిందితులు నేరానికి పాల్పడినట్లు సీబీఐ నిరూపించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా దోషులకు శిక్ష విధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం లేదా విడుదల చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్పీసీ సెక్షన్ 435(1)(A) చెబుతుందన్నారు. ఈ కేసులో 11 మంది నిందితులను విడుదల చేసేందుకు  కేంద్రంతో గుజరాత్ సర్కారు సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదని చెప్పారు.


  
దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు..
క్రిమినల్ అప్పీల్ నెంబరు 490-491/2011 కేసులో 2012 నవంబరు 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 1992 నాటి విధానం స్థానంలో 2014లో సవరించిన రిమిషన్ విధానం వచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రభుత్వాలు రిమిషన్ అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించొద్దని..., వాస్తవిక దృష్టితో ఆ అధికారాలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసిందని చెప్పారు. ఈ క్రూరమైన నేరం జరిగినప్పుడు బిల్కిస్ బానో వయసు 21 సంవత్సరాలు కాగా ఆమె ఐదు నెలల గర్భిణి అనే విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఈ కేసులో నిందితులు జైలు నుంచి బయటకు రావడం, వారికి పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బానో మనసు ముక్కలై ఉంటుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని దోషులను వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలని తద్వారా చట్టాలపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచాలని సీజేఐను ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.