ఎన్నికల కోడ్​కు దొరక్కుండా టీఆర్​ఎస్​ ప్లాన్​

ఎన్నికల కోడ్​కు దొరక్కుండా టీఆర్​ఎస్​ ప్లాన్​

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో ప్రచారానికి టీఆర్‌‌ఎస్‌‌ కొత్తదారులు వెతుకుతోంది. ఎన్నిక జరిగే సెగ్మెంట్​లో వెయ్యి మందితోనే సభలు పెట్టుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వడంతో.. కోడ్​ అమలులో లేని పక్క నియోజకవర్గంలో సభలకు ప్లాన్​ చేస్తోంది. హుజూరాబాద్ పట్టాణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ జిల్లా పెంచికల్​పేటలో పెద్ద పెద్ద సభలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఆర్టీసీ చైర్మన్‌‌ బాజిరెడ్డి గోవర్ధన్‌‌కు మున్నూరుకాపుల ఆత్మీయ సన్మానానికి ఇదే వేదికను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ఇకపై ఇదే వేదిక నుంచి భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

భారీ సభలతో కేడర్​లో జోష్​ నింపొచ్చని..

హుజూరాబాద్‌‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు పార్టీలు ప్రచారం చేసుకోవడానికి అవకాశముంది. కరోనా థర్డ్‌‌ వేవ్‌‌ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారానికి కఠిన నిబంధనలు పెట్టింది. కోడ్​ అమలులో ఉన్న హుజూరాబాద్​ సెగ్మెంట్​లో బహిరంగ సభలు వెయ్యి మందితోనే ఏర్పాటు చేసుకోవాలంది. రోడ్డు షోలకు చాన్స్‌‌ ఇవ్వలేదు. దీంతో ఎంత ప్రచారం చేసినా ఆశించినంతగా ఉత్సాహాన్ని క్యాడర్‌‌లో నింపలేకపోతున్నామని టీఆర్​ఎస్​భావిస్తోంది. సభలు పెడితే తప్ప జోష్‌‌ సాధ్యం కాదని ప్రత్యామ్నాయాలు వెతికింది. హుజూరాబాద్‌‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే హుస్నాబాద్‌‌ నియోజకవర్గంలోని పెంచికల్‌‌పేట గ్రామం ఉంది. కరీంనగర్‌‌ -= వరంగల్‌‌ హైవేను ఆనుకుని ఉన్న ఈ గ్రామ శివారులో పదెకరాల వరకు ఖాళీ స్థలం ఉంది. హైవేకు అవతలి వైపున హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలోని చిన్నపాపయ్యపల్లి గ్రామ శివారులోనూ ఖాళీ స్థలం ఉంది. బహిరంగ సభ పెంచికల్‌‌పేట శివారులో పార్కింగ్‌‌, ఇతర అవసరాల కోసం చిన్నపాపయ్యపల్లి శివారులోని ఖాళీ స్థలాన్ని వాడుకోవాలని నిర్ణయానికి వచ్చింది.

మున్నూరు కాపులతో షురూ

హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీసీ కులాల్లో టీఆర్‌‌ఎస్‌‌కు ఆధిక్యం చిక్కడం లేదని నేతలు అంచనా వేస్తున్నారు. ఆయా కులాల ముఖ్య నేతలను రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆర్టీసీ చైర్మన్‌‌, నిజామాబాద్‌‌ రూరల్‌‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌‌కు భారీ సన్మాన సభ పెంచికల్‌‌పేటలో ఏర్పాటు చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌‌ నేతృత్వంలో సభ నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని గాయత్రీ గ్రానైట్స్‌‌ యజమాని వద్దిరాజు రవిచంద్ర కార్యక్రమానికి ఆహ్వాన కమిటీ చైర్మన్‌‌గా వ్యవహరిస్తున్నారు. మున్నూరుకాపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించారు. వేలాదిగా తరలివచ్చి మున్నూరుకాపుల ఐక్యత చాటాలని ఆహ్వానాలు పంపారు. సభ నిర్వహించేది హుస్నాబాద్‌‌ నియోజకవర్గ పరిధిలోనే అయినా సభకు తరలించే మున్నూరుకాపులంతా హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలోని వారే. మున్నూరుకాపులతో మొదలు పెట్టి అన్ని కులాలతో ఇక్కడే వరుస బహిరంగ సభలకు టీఆర్‌‌ఎస్‌‌ ప్లాన్‌‌ చేసింది.

కేసీఆర్ ప్రచార సభ ఇక్కడే!

హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌‌ ప్రచార సభకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సీఈసీ నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం లేనందున కేసీఆర్‌‌ ప్రచార సభ కూడా పెంచికల్‌‌పేటలోనే నిర్వహించనున్నట్టు టీఆర్‌‌ఎస్‌‌ నేతలు చెప్తున్నారు. ఈ నెల 26న సీఎం ప్రచార సభ నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు చెప్తున్నారు.