ఆన్ లైన్ లో టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ సభ్యుల వివరాలు

ఆన్ లైన్ లో  టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ సభ్యుల వివరాలు
  • పార్టీ సభ్యుల వివరాలు ఆన్‌‌లైన్‌‌
  • ఇందుకు తెలంగాణ భవన్‌ లో ప్రత్యేక విభాగం
  • కేటీఆర్‌‌ ఆఫీస్‌‌తో అనుసంధానం
  • కార్యకర్తల బ్లడ్‌‌ గ్రూప్‌ ,ఇతర వివరాలు సేకరణ
  • జిల్లా ఆఫీసుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ గది ఏర్పాటు

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ డిజిటలైజేషన్‌‌ వైపు అడుగులేస్తోంది. సభ్యత్వ నమోదు నుంచి కార్యకర్తల వెల్ఫేర్‌‌ వరకు ఆన్‌‌లైన్‌‌ చేయాలని ప్లాన్‌‌ చేస్తోంది. జిల్లా పార్టీ ఆఫీస్‌‌లను స్టేట్‌‌ ఆఫీస్‌‌తో కనెక్ట్‌‌ చేస్తూ అధినాయకత్వం కిందిస్థాయి కార్యకర్తలకూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీస్‌‌ నిర్మాణంతో తొలి అడుగు వేస్తోంది.

పార్టీ ఆఫీస్‌‌లకు నేడు భూమి పూజ

టీఆర్‌‌ఎస్‌‌కు హైదరాబాద్‌‌లో మినహాయిస్తే  ఖమ్మంలోనే పార్టీ ఆఫీస్‌‌ ఉంది. కరీంనగర్‌‌లో ఉత్తర తెలంగాణ భవన్‌‌ ఉన్నా దాన్ని కేసీఆర్‌‌ నివాసంగానే వాడుతున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రైవేట్‌‌ భవనాల్లోనే పార్టీ ఆఫీస్‌‌లు కొనసాగుతున్నాయి. రెండోసారి అధికారంలోకొచ్చాక పూర్తిస్థాయి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన టీఆర్‌‌ఎస్‌‌.. తొలి అడుగుగా జిల్లా కేంద్రాల్లో ఆఫీస్‌‌ల నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేయనుంది. రెండు మూడు రోజుల్లోనే పనులు ప్రారంభిస్తారు. ఒక్కో ఆఫీస్‌‌ నిర్మాణానికి రూ.60 లక్షలు కేటాయించారు.  వరంగల్‌‌ రూరల్‌‌ జిల్లాతోపాటు హైదరాబాద్‌‌ జిల్లా కార్యాలయానికి ఇంకా స్థలాలు కేటాయించలేదు.

భారీగా సభ్యత్వ నమోదు

పార్టీ సభ్యత్వ నమోదు కోసం పక్కా ప్లాన్‌‌ చేస్తున్నారు. పార్టీ సెంట్రల్‌‌ ఆఫీస్‌‌లో ఇందుకు ప్రత్యేకంగా ఇన్‌‌చార్జీలను నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి నేతృత్వంలోని ఓ టీం డైలీ నియోజకవర్గాల వారీగా మానిటరింగ్‌‌ చేయనుంది. ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సభ్యత్వాలు టార్గెట్‌‌గా పెట్టుకుంది. ప్రతి ఒక్కరి ఫోన్‌‌, ఆధార్‌‌ నంబర్‌‌, బ్లడ్‌‌ గ్రూప్‌‌ వివరాలు తీసుకుంటారు. జూలై 20లోగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి ఆ వివరాలను సెంట్రల్‌‌ ఆఫీస్‌‌లో డిజిటలైజ్‌‌ చేస్తారు. ఆ వివరాలను వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ఆఫీస్‌‌తో అనుసంధానం చేస్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా ఆఫీసులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహిస్తూ క్యాడర్‌‌కు అవసరమైన సలహాలు, సూచనలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

క్యాడర్‌‌ వెల్ఫేర్‌‌పై నజర్‌‌

పార్టీ మెంబర్‌‌ షిప్‌‌ తీసుకున్న వారికి ప్రస్తుతం రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచడంతోపాటు కార్యకర్తలకు ఉచిత వైద్య సాయం అందించడంపై నాయకత్వం దృష్టి పెట్టింది.

పార్టీ ఆఫీసుల్లో గ్రీవెన్స్‌‌ సెల్స్‌‌

పార్టీ జిల్లా ఆఫీసులను దసరాకు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అన్ని ఆఫీసుల్లో గ్రీవెన్స్‌‌ సెల్స్‌‌ ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం, వాటిని ఎమ్మెల్యేలకు ఆన్‌‌లైన్‌‌లో పంపి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం చేస్తారు.

జీ ప్లస్‌‌ టు బిల్డింగ్స్‌

పార్టీ ఆఫీస్‌ ల కోసం మూడు మోడళ్లను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. ఈనెల 27లోగా ఏదో ఒక మోడల్‌ ను సీఎం ఫైనల్‌ చేసే అవకాశముంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ తోపాటు రెండు అంతస్తులతో భవనం నిర్మించనున్నట్టు సమాచారం.గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో కనీసం వెయ్యి మంది సీటింగ్‌ కెపాసిటీతో మీటింగ్‌ హాల్‌ నిర్మించనున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం మినీ క్యాంటిన్‌ ఉంటుందని సమాచారం. మొదటి ఫ్లోర్‌ లో పార్టీ అధినేత, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వీడియో కాన్ఫరెన్స్‌‌లు నిర్వహించేందుకు వీలుగా డిజిటల్‌ స్టూడియో ఉంటుంది. రెండో ఫ్లోర్‌ లో కార్యకర్తల విశ్రాంతి గదులుంటాయి.