టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై  సోమవారం జనరల్ సెక్రటరీ లతో సమీక్ష నిర్వహించారు. సుమారు 70 లక్షల మంది టిఆర్ఎస్ పార్టీ సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేటీఆర్ తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ ఆదేశించిన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆ లక్ష్యం మేరకు సభ్యత్వం పూర్తయిందని,  కొన్ని నియోజకవర్గాల్లో సుమారు లక్ష సభ్యత్వం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. చాలా నియోజకవర్గాల్లో 50 వేలకు మించి సభ్యత్వ నమోదు అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాల పరిధిలోని జిల్లాల్లోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా కొనసాగుతున్నదని,  అయితే ఆయా జిల్లాల్లోని పార్టీ శ్రేణులకు మరో మూడు, నాలుగు రోజుల పాటు అదనపు గడువు అవసరమని పార్టీ ప్రధాన కార్యదర్శలు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో వారం, పది రోజుల పాటు పొడిగించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరిన విషయాన్ని వారు కేటీఆర్ కు తెలిపారు.  క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి తెలుపుతామని, ఆయన ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మరింత గడువుపై స్పష్టత ఇస్తామని చెప్పారు కేటీఆర్ . సభ్యత్వ నమోదు తోపాటు సమాంతరంగా డిజిటలైజేషన్ ఈ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుందని, ఇప్పటికే సుమారు 50 శాతం సభ్యత్వ వివరాలను కంప్యూటరీకరణ చేశామని కేటీఆర్ తెలిపారు.