మున్సిపోల్స్​లో ఎంఐఎంతో టీఆర్ఎస్ ఉత్తుత్తి ఫైటింగ్​

మున్సిపోల్స్​లో ఎంఐఎంతో టీఆర్ఎస్ ఉత్తుత్తి ఫైటింగ్​
  • మజ్లిస్ ఉన్న చోట డమ్మీ గులాబీలు!
  • స్ట్రాంగ్ అభ్యర్థులను మార్చేయాలని ఆదేశాలు
  • ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రాత్రికి రాత్రే మార్పులు
  • నిజామాబాద్, కరీంనగర్  కార్పొరేషన్​లో ఇదే వ్యూహం
  • రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ సేమ్​ ప్లానింగ్​
  • శుక్రవారం ఒకే రోజు 50 చోట్ల మార్పులు
  • అందులో 20 సీట్లు ఎంఐఎం పోటీ చేస్తున్నవే

హైదరాబాద్, వెలుగు:

మున్సిపల్​ ఎన్నికల్లో ఎంఐఎంతో టీఆర్​ఎస్​ ఉత్తుత్తి ఫైటింగ్​కు సిద్ధమైంది. మజ్లిస్​ క్యాండిడేట్లు పోటీ చేసే చోట డమ్మీ క్యాండిడేట్లను బరిలోకి దింపింది. కొన్నిచోట్ల తమ బలమైన అభ్యర్థులును తప్పించి, అంతగా పట్టులేని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.  బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే తమ అభ్యర్థులకు ఇబ్బంది వస్తుందని ఎంఐఎం నేతలు అభ్యంతరం చెప్పడంతో గులాబీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. స్ట్రాంగ్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించాలని సీఎం క్యాంప్​ ఆఫీసు నుంచే జిల్లా నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారంలో ఉంది.  ‘ఎంఐఎం పోటీ చేసే చోట కూడా గెలిచే అభ్యర్థుల కోసం సర్వేలు చేయించినం. అభ్యర్థులను గుర్తించినం. ఎలక్షన్ కు రెడీగా ఉండాలని చెప్పినం. వాళ్లు కూడా అన్ని సిద్ధం చేసుకున్నరు. లాస్ట్​ మినిట్​లో పార్టీ పెద్దల మనసు మారింది. బలం లేని అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆదేశాలు వచ్చినయ్’ అని టీఆర్ఎస్ లోని ఓ సీనియర్  నేత  చెప్పారు.

ఒకేరోజు 50 చోట్ల మార్పు

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 50 మంది అభ్యర్థులను టీఆర్​ఎస్​ మార్చింది. ఇందులో 20 సీట్లు ఎంఐఎం పోటీ చేసే చోట్లే ఉన్నాయి. ముందుగా అనుకున్న అభ్యర్థులను ఇప్పుడు చివరి నిమిషంలో చేంజ్ చేయడంతో అధికార పార్టీలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఎంత నచ్చచెప్పినా రెబల్స్​  మాట వినకుండా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారని టీఆర్​ఎస్​కు చెందిన ఓ నాయకుడు అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో టీఆర్​ఎస్​ ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఎంఐఎంకు గట్టి పోటీ ఉండకుండా.. తేలికైన అభ్యర్థులను పోటీలో ఉంచింది. గురువారం రాత్రికి రాత్రే హుజూర్ నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థుల మార్చేసింది. ఆ స్థానాల్లో డమ్మీలను పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్  ఎన్నికల్లో ఎంఐఎం 16 చోట్ల విజయం సాధించింది. ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని  ప్రయత్నిస్తోంది. అక్కడ కూడా బలమైన అభ్యర్థులను బరిలో నుంచి తప్పించాలని స్థానిక నేతలకు టీఆర్​ఎస్​ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. ఇక, ఎన్నికలు వాయిదా పడ్డ కరీంనగర్​ కార్పొరేషన్​లోనూ ముందస్తుగానే మజ్లిస్, టీఆర్​ఎస్​ మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. ఈ కార్పొరేషన్​లో గతంలో మజ్లిస్  7 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో అక్కడ కూడా మరిన్ని సీట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థుల స్థానంలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టాలని టీఆర్​ఎస్​ నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా, నిర్మల్ మున్సిపాల్టీల్లో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బడంగ్​పేట కార్పొరేషన్​లోనూ ఇదే తీరుగా అధికార పార్టీ వెళ్తున్నట్లు చర్చ నడుస్తోంది.

మేయర్, చైర్​పర్సన్​ పదవుల కోసమేనా?

అన్ని సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని టీఆర్ఎస్ పెద్దలు చెప్తున్నా.. కార్పొరేషన్​ మేయర్, మున్సిపల్​ చైర్​పర్సన్​ పదవుల ఎంపికకు ఇబ్బంది వస్తుందనే అనుమానం వారిని వెంటాడుతోంది. మేయర్, చైర్​పర్సన్​ పదవులను సొంతం చేసుకునేందుకు ఎంఐఎం సహకారం తీసుకోవాలని కేసీఆర్  నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్  ఒవైసీతో మాట్లాడినట్లు సమాచారం. మేయర్, చైర్​పర్సన్​ ఎన్నికకు కావాల్సినంత సంఖ్యా బలం టీఆర్ఎస్  పార్టీకి లేనిచోట మజ్లిస్ పార్టీ సభ్యుల సహకారం తీసుకోవాలనే అంగీకారం రెండు పార్టీల మధ్య కుదిరినట్టు తెలిసింది. ఈ నెల 25న కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నికల ఫలితాలు రానున్నాయి.  ఆ తర్వాత మేయర్, చైర్​పర్సన్​ పదవుల ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్  ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తు్ంది. ఆ ఎన్నిక నాటికి గ్రౌండ్ క్లీయర్ గా ఉండేందుకుగాను కౌన్సిలర్​, కార్పొరేటర్​ అభ్యర్థుల ఎంపికలోనే ఒక ఒప్పందానికి వచ్చి.. ఉత్తుత్తి ఫైటింగ్​ చేయాలని రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

TRS Prepared for Friendly Fighting with MIM in municipal elections