3 వేల కార్లతో టీఆర్ఎస్ ర్యాలీ.. ట్రాఫిక్ జామ్

3 వేల కార్లతో టీఆర్ఎస్ ర్యాలీ.. ట్రాఫిక్ జామ్
  • మునుగోడు సభకు సీఎం కాన్వాయ్ వెంట నేతలు 
  • దాదాపు గంటన్నర పాటు నగరవాసులకు ఇబ్బందులు
  • ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్​లు, విద్యార్థులు 
  • చిందులేస్తూ మంత్రి మల్లారెడ్డి హంగామా 

హైదరాబాద్‌‌ / ఎల్బీనగర్‌‌‌‌, వెలుగు: మునుగోడు సభకు సీఎం కాన్వాయ్ వెంట వేలాది కార్లలో టీఆర్ఎస్ నేతలు తరలివెళ్లడంతో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం కాన్వాయ్ కోసం పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేశారు. దీనికితోడు కాన్వాయ్ వెంట వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు వందలాది కార్లతో వెనుక బయలుదేరారు. ఈ కారణంగా దాదాపు గంటన్నర పైనే ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ముందుకు, వెనుకకు వెళ్లలేక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

టీఆర్ఎస్ నేతల హంగామా.. 

మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ నుంచి సీఎం కాన్వాయ్‌‌ బయలుదేరింది. సికింద్రాబాద్‌‌, ఉప్పల్‌‌, ఎల్బీనగర్‌‌‌‌, హయత్‌‌నగర్‌‌‌‌, చౌటుప్పల్‌‌ మీదుగా మునుగోడు వెళ్లింది. సీఎం కాన్వాయ్‌‌కి అనుగుణంగా 20 నిమిషాల ముందే ఎక్కడిక్కడ పోలీసులు వాహనాలను నిలిపివేశారు. నిరంతరం రద్దీగా ఉండే  ప్రధాన రోడ్లన్నీ బ్లాక్ చేశారు. రోడ్లకు రెండు వైపుల బారికేడ్లు పెట్టి, ట్రాఫిక్ ను మళ్లించారు. దీనికి తోడు సభ కోసం హైదరాబాద్‌‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌ మల్కాజ్​గిరి జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా వందలాది కార్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా 3 వేల కార్లలో తమ అనుచరులు, కార్యకర్తలను వెంటబెట్టుకొని సీఎం వెంట మునుగోడుకు బయల్దేరారు. డీజేలు మోగిస్తూ, పటాకులు కాలుస్తూ హంగామా చేశారు. క్యాడర్‌‌లో జోష్‌‌ నింపేందుకు మంత్రి మల్లారెడ్డి తన రూఫ్‌‌టాప్‌‌ కారులో చిందులేశారు. ఉప్పల్‌‌లో కేసీఆర్‌‌కు స్వాగతం పేరుతో టీఆర్‌‌ఎస్‌‌ నేతలు ఓవరాక్షన్‌‌ చేశారు. రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినా హంగామా ఆపలేదు. 

ఎల్బీనగర్​లో వేలాడిన కరెంట్ తీగలు.. 

సీఎం కాన్వాయ్‌‌లోని వాహనాలు తగిలి ఎల్బీనగర్‌‌‌‌ రింగ్‌‌రోడ్డులో కరెంట్‌‌ తీగలు కిందికి వేలాడాయి. దీంతో కొందరు ఆర్టీసీ బస్సుపైకి ఎక్కి వాటిని సరిచేశారు. సీఎం కాన్వాయ్‌‌ వెళ్లిపోయినప్పటికీ ఎల్బీనగర్‌‌‌‌ పరిసర  ప్రాంతాల్లో గంటపాటు ట్రాఫిక్ జామ్‌‌ అయింది.

అంబులెన్స్​లకూ తొవ్వ ఇవ్వలే..

ఉప్పల్‌‌, ఎల్బీనగర్‌‌‌‌లో పరిస్థితి దారుణంగా మారింది. ఈ రెండు రూట్లలో వరంగల్‌‌, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. నాగోల్, ఎల్బీనగర్ రింగ్‌‌రోడ్, సాగర్‌‌‌‌రింగ్ రోడ్డు, విజయవాడ, వరంగల్‌‌ హైవే రోడ్లన్నీ జామ్‌‌ అయ్యాయి. దీంతో నాలుగైదు అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. ఎల్బీనగర్‌‌ లో ఓ అంబులెన్స్ కు వాహనదారులే రూట్ క్లియర్ చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. ఉప్పల్‌‌లో పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు. మెడికల్‌‌ ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ పంపించడం లేదని ఫైర్ అయ్యారు. సభకు సీఎం వేలాది కార్లతో రోడ్డుపైనే ఎందుకు వెళ్లాలి? హెలికాప్టర్ లో వెళ్లొచ్చు కదా? అని ప్రశ్నించారు. కాగా, బ్యాంక్ ఎగ్జామ్స్, పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన స్టూడెంట్లు ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. సమయానికి సెంటర్లకు వెళ్లేందుకు నానాతిప్పలు పడ్డారు. 

ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు.. 

సీఎం కాన్వాయ్‌‌ వస్తోందని 20 నిమిషాలే ముందే ఎక్కడికక్కడ వాహనాలు ఆపారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ముఖ్యమంత్రులు పని చేయాలి. హెలికాప్టర్‌‌‌‌లో వెళ్లేందుకు అవకాశం ఉన్నా.. జనాలకు ఇబ్బంది కలిగేలా ఇలాంటి ర్యాలీలు చేపట్టడం ఎందుకు?.  

- ఆదినారాయణ‌‌, మలక్‌‌పేట్‌‌