కేంద్రంతో లొల్లి

కేంద్రంతో లొల్లి
  • కార్యకర్తల నుంచి ముఖ్య నేతల దాకా వరుస ట్వీట్లు
  • హామీల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకేనని విమర్శలు
  • అన్ని ట్వీట్లు దాదాపు ఒకే తీరు
  • ప్రగతిభవన్​ నుంచే  ఆపరేట్​ చేస్తున్నట్లు అనుమానాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమలు చేయాల్సిన స్కీమ్​లను గాలికొదిలేసి.. కేంద్ర ప్రభుత్వంపై ట్వీట్లు చేసేందుకు, తిట్లు తిట్టేందుకు రాష్ట్ర మంత్రులు, టీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో అనేక స్కీమ్​లు ముందుకు సాగక, ఇచ్చిన హామీలు అమలు కాక జనం అవస్థలు పడుతున్నారు. కానీ, అవేవీ అధికార పార్టీ ముఖ్య నేతలకు పట్టడం లేదు. మాటలు చెప్పిన విధంగా రాష్ట్రంలో స్కీమ్​లు అమలైతలేవని, ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని హుజూరాబాద్​ ఎన్నికల తర్వాత నుంచి టీఆర్​ఎస్​ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. 

సోషల్​ మీడియాలో ఎప్పుడూ కనిపించనోళ్లు కూడా..!
తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరి అనుసరిస్తోందంటూ టీఆర్​ఎస్​ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి కేటాయింపులేమీ చేయలేదని సీఎం కేసీఆర్​ తీవ్ర విమర్శలు చేసిన రోజు నుంచి టీఆర్​ఎస్​ ఈ విమర్శల దాడిని ముమ్మరం చేసింది.  వరుస ప్రెస్​ మీట్లు, మంత్రుల ట్వీట్లన్నీ ఒకే తీరుగా కనిపిస్తుండటంతో.. ప్రగతిభవన్​ నుంచే వీటిని ఆపరేట్​ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. సోషల్​ మీడియాలో ఎప్పుడూ కనిపించని కొందరు మంత్రులు ట్వీట్లు పెట్టడాన్ని అందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. 

విభజన నాటి హామీలను ముందేసుకోవటం టీఆర్​ఎస్​కు అనుకూలించకపోగా రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తున్నది. ‘ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఆవిష్కరణ కోసం హైదరాబాద్​కు ప్రధాని వచ్చిన రోజున ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ అంటూ సోషల్​ మీడియా వేదికగా టీఆర్​ఎస్​ లీడర్లు వరుసగా పోస్టులు పెట్టారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం రాసిన లేఖలపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం పైన వివక్ష చూపుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మేడారం  జాతరను జాతీయ పండుగగా గుర్తించడం లేదని మంత్రి సత్యవతి రాథోడ్, తెలంగాణ లాంటి అభివృద్ధి  రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఆపుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్లు చేశారు. ఆ ఒక్కరోజే సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అయినట్లు మంత్రి కేటీఆర్ ఆఫీస్ ప్రకటించింది. మోడీ  కోచ్​ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినా.. ‘మేధా’ గ్రూప్ కొడంకల్​లో  ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నదని కేటీఆర్ ఇటీవల ట్వీట్ చేశారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల అమలులో ఫెయిలవడం వల్లే ఇప్పుడు కేంద్రంపై బాణాలు ఎక్కుపెట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

రాష్ట్రంలో స్కీమ్​లన్నీ ఆగమాగం
రాష్ట్రంలో అనేక స్కీమ్​లు ముందుకు కదుల్తలేవు. డబుల్​ బెడ్రూం ఇండ్లు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, రెండో విడత గొర్రెల పంపిణీ.. ఇట్లా దాదాపు స్కీమ్​లన్నీ అటకెక్కాయి. నాగార్జునసాగర్​, హుజూరాబాద్​ బై ఎలక్షన్ల టైమ్​లో తప్ప.. మిగతా సందర్భాల్లో ఈ స్కీమ్​లు అమలు కాకుండా ఆగిపోయాయి. నిరుద్యోగ భృతి,  ఉద్యోగ నియామకాలు, 57 ఏండ్లకు ఆసరా పెన్షన్, పోడు భూములకు పట్టాల పంపిణీ.. వంటి హామీలు మూడేండ్లుగా వాయిదా పడుతూనే ఉన్నాయి. ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు అర్జీలు తీసుకోవటం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ హామీలను అమలు చేసే దిశగా కార్యాచరణ ప్రకటించడంలేదు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఏడాది దాటినా ఒక్క జాబ్‌‌ నోటిఫికేషన్​ కూడా వేయలేదు. జాబ్​ క్యాలెండర్​ ప్రకటనకు కొత్త ఏడాది కూడా మోక్షం దక్కలేదు.  డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లు ఏడేండ్లలో కేవలం 14 వేల మందికే అందాయి. నిర్మించిన ఇండ్లను కూడా పంపిణీ చేయడం లేదు. సొంత స్థలాలుంటే ఇండ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తామన్న హామీ అమలు కావడం లేదు. 57 ఏండ్లు నిండిన వాళ్లకు ఆసరా పెన్షన్లు ఇస్తామనే హామీ.. అప్లికేషన్ల దగ్గర్నే ఆగిపోయింది. మొదట్లో అప్లయ్​ చేసుకున్న వారికి ఇప్పుడు 60 ఏండ్ల నిండినా  కొత్త పెన్షన్​ మాత్రం అందటం లేదనే ఫిర్యాదులున్నాయి. హుజూరాబాద్‌‌లో మొదలుపెట్టిన దళిత బంధు​కు బ్రేకులు పడ్డాయి. అక్కడ 20వేల మందికి ఇస్తామని చెప్పిన  ప్రభుత్వం ఇప్పటివరకు వెయ్యి మందికి మాత్రమే ఇచ్చింది. రాష్ట్రంలో మొదట ప్రకటించిన మిగతా నాలుగు మండలాల్లో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పత్తాలేదు. దళితులకు మూడెకరాల భూమి స్కీమ్​కు 60 లక్షల మంది అర్హులుంటే.. ప్రభుత్వం కేవలం 7 వేల మందికి పంపిణీ చేసింది. గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ మాట మరిచిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు సబ్సిడీ లోన్లు అందడం లేదు. సెకండ్‌‌ ఫేజ్‌‌ గొర్రెల పంపిణీ స్కీం ఆగిపోయింది. నాగార్జున సాగర్‌‌, హుజూరాబాద్‌‌ బై ఎలక్షన్​ టైమ్​లో పంపిణీ చేసి.. తర్వాత ఆపేశారు.