నేరేడుచర్ల, మేడ్చల్.. టీఆర్ఎస్ ఖాతాలోకే

నేరేడుచర్ల, మేడ్చల్.. టీఆర్ఎస్ ఖాతాలోకే

హైదరాబాద్‌‌/సూర్యాపేట/నేరేడుచర్ల, వెలుగు: నల్గొండ జిల్లా నేరేడుచర్ల చైర్​పర్సన్​ ఎన్నికపై హైడ్రామా నడిచినా.. చివరికి అధికార టీఆర్‌‌ఎస్‌‌ ఆ మున్సిపాల్టీని దక్కించుకుంది. టీఆర్‌‌ఎస్‌‌ పక్షాన మరో ఎక్స్‌‌ అఫీషియో ఆప్షన్‌‌ను సోమవారం రాత్రి మున్సిపల్‌‌ ఎలక్షన్‌‌ అథారిటీ ఆమోదించడంతో ఆ పార్టీ ఈజీగా ఈ సీటు గెలుచుకుంది. ఈ ఎలక్షన్‌‌పై కాంగ్రెస్​ అభ్యంతరం చెప్పగా.. మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అధికారులు మాత్రం అంతా చట్టప్రకారమే చేశామని చెప్తున్నారు. మరోవైపు మేడ్చల్​ మున్సిపాల్టీ కూడా కారు ఖాతాలోనే పడింది.

ఎమ్మెల్సీ ఓటుతో..

నేరేడుచర్ల మున్సిపాల్టీలో 15 వార్డులుండగా కాంగ్రెస్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ చెరో ఏడు గెలిచాయి. ఒక వార్డులో సీపీఎం విజయం సాధించింది. దీంతో చైర్మన్‌‌ ఎన్నికకు ఎక్స్‌‌అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఇక్కడ ఓటు వేసేందుకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌‌, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 10కి చేరుకుంది. సీపీఎం కౌన్సిలర్‌‌ మద్దతు, ఎక్స్‌‌ అఫీషియోగా నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్​ బలం 9కి చేరుకుంది. మరో ఎక్స్‌‌అఫీషియోగా రాజ్యసభ సభ్యుడు కేవీపీని తీసుకురావడంతో చెరో 10 మంది సభ్యులతో కాంగ్రెస్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ సమానంగా నిలిచాయి. కేవీపీ పేరుపై టీఆర్‌‌ఎస్‌‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సోమవారం జరగాల్సిన చైర్మన్‌‌ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది.

ఉదయం నుంచే హైడ్రామా

మంగళవారం ఉదయం 11 గంటలకు టీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ సభ్యులు మున్సిపల్‌‌ ఆఫీస్‌‌కు చేరుకున్నారు. ఎలాగైనా ఈ మున్సిపాల్టీని దక్కించుకోవాలని భావించిన టీఆర్‌‌ఎస్‌‌.. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌‌రెడ్డితో ఇక్కడ ఆప్షన్‌‌ ఇప్పించింది. ఓటరు లిస్ట్‌‌లో టీఆర్ఎస్ తరఫున సుభాష్​రెడ్డి పేరు ఉండడంతో కాంగ్రెస్‌‌ నేతలు ఆందోళనకు దిగారు. అధికారులు, టీఆర్‌‌ఎస్‌‌ నేతల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌‌ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. కోరం ఉండడంతో అధికారులు ఎన్నిక నిర్వహించగా చైర్మన్‌‌గా చందమల్ల జయబాబు, వైస్‌‌ చైర్‌‌పర్సన్‌‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. మున్సిపల్ అధికారుల వైఖరికి నిరసనగా ఎంపీ ఉత్తమ్, కాంగ్రెస్​ నేతలు రాస్తా రోకో చేసి నిరసన తెలిపారు.

రూల్స్​ ప్రకారమే చేశాం

ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఏదో ఒక మున్సిపాల్టీలో ఎక్స్‌‌ అఫీషియోగా ఆప్షన్‌‌ ఇచ్చుకోవడానికి కొత్త మున్సిపల్‌‌ యాక్ట్‌‌ అవకాశం కల్పించింది. రాజ్యసభ సభ్యులు, గవర్నర్‌‌ కోటా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు నియోజకవర్గం ఉండదు కాబట్టి రాష్ట్రంలో ఎక్కడైనా వారు తమ ఆప్షన్‌‌ ఇచ్చుకోవచ్చు. ఈ రూల్​కు లోబడే ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి ఆప్షన్‌‌ ఇస్తే సభ్యుల జాబితాలో చేర్చామని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇవే ఫస్ట్‌‌ జనరల్‌‌ మున్సిపల్‌‌ ఎలక్షన్లని మున్సిపల్‌‌ అధికారులు స్పష్టం చేశారు. జీహెచ్‌‌ఎంసీ మేయర్‌‌ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి ఇప్పుడు మరో అర్బన్​ లోకల్​ బాడీలో ఎక్స్‌‌ అఫీషియోగా ఆప్షన్‌‌ ఇచ్చుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు ఆప్షన్‌‌ ఇచ్చిన వారు వచ్చే ఏడాది జరిగే జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ ఎక్స్‌‌ అఫీషియోగా ఆప్షన్‌‌ ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పారు. ఈ నిబంధనలకు లోబడే అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎక్స్‌‌ అఫీషియోకు చాన్స్‌‌ ఇచ్చామన్నారు.