కరోనా ట్రీట్‌‌మెంట్.. 9 నెలల నుంచి ఒక్క రోజూ సెలవు తీసుకోని డాక్టర్

కరోనా ట్రీట్‌‌మెంట్.. 9 నెలల నుంచి ఒక్క రోజూ సెలవు తీసుకోని డాక్టర్

న్యూయార్క్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైమ్‌‌లో హెల్త్ కేర్ వర్కర్స్ అందిస్తున్న సేవలు అపురూపమనే చెప్పాలి. కుటుంబాలకు దూరంగా ఉంటూ వైద్యులు అందించిన సేవలను ఎవరూ మర్చిపోరు. ఇలాంటి కోవలోకి చెందే ఓ డాక్టరే జోసెఫ్ వరోన్. యూఎస్‌కు చెందిన జోసెఫ్.. దాదాపు 9 నెలల నుంచి ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా పని చేస్తుండటం విశేషం. యునైటెడ్ మెమోరియాల్ ఆస్పత్రి చీఫ్ అయిన జోసెఫ్ పేషెంట్స్ ట్రీట్‌‌మెంట్ కోసం అవిశ్రాంతంగా క‌ృషి చేస్తున్నారు. తక్కువ ఆదాయం కలిగిన ప్రజలకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయం గురించి వరోన్ స్పందిస్తూ.. పేషెంట్లకు సేవ చేయడం తన ధర్మమని చెప్పారు.

‘ఇదంతా ఎలా చేస్తున్నానా అని అడగకండి. పనిలో బిజీగా ఉండటానికి ప్రాధాన్యం ఇస్తా. ఏది తెచ్చి ఇచ్చినా తినేస్తా. ఎందుకంటే తినడానికి టైమ్ దొరకనంత బిజీగా ట్రీట్‌‌మెంట్ అందిస్తున్నాం. నా కంటే మా స్టాఫ్ చాలా కష్టపడుతున్నారు. నర్సులు అయితే ఒక్కోసారి ఏడుస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండటంతో నర్సులు తీవ్రంగా అలసిపోతున్నారు. అమెరికన్లు సోషల్ డిస్టెన్సింగ్ గైడ్‌‌లైన్స్‌‌ను పాటిస్తే మా లాంటి హెల్త్ కేర్ వర్కర్స్‌‌ హాయిగా రెస్ట్ తీసుకుంటాం’ అని వరోన్ పేర్కొన్నారు.