నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. పిరికివాళ్లంటూ ఎద్దేవా చేసిన అమెరికా ప్రెసిడెంట్

నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. పిరికివాళ్లంటూ ఎద్దేవా చేసిన అమెరికా ప్రెసిడెంట్
  • మిత్ర దేశాలు చేసిన ఈ ద్రోహాన్ని గుర్తుంచుకుంటమని వార్నింగ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ మిత్రదేశాలపై నిప్పులు చెరిగారు.  హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సృష్టిస్తున్న అలజడిని అణచివేసేందుకు సైనిక సహకారం అందించని దేశాలను ఉద్దేశించి అత్యంత కఠినమైన పదజాలం వాడారు. "మీరంతా పిరికివాళ్లు (కోవార్డ్స్).. క్లిష్ట సమయంలో మీరు చేసిన ఈ పనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం!" అంటూ తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరికల బాంబు పేల్చారు. అమెరికా అండ లేకపోతే నాటో కేవలం ఒక ‘కాగితపు పులి’ అని ఆయన ఎద్దేవా చేశారు.

ఫిర్యాదులకు సిద్ధం.. సాయానికి దూరం!

చమురు ధరలు పెరిగిపోతున్నాయని ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్న మిత్రదేశాలు, ఆ ధరలను తగ్గించేందుకు అవసరమైన హార్మూజ్ జలసంధి పునరుద్ధరణలో మాత్రం చేతులు ముడుచుకు కూర్చున్నాయని ట్రంప్ మండిపడ్డారు. యుద్ధం మొదలవ్వకముందు 70 డాలర్లున్న బ్యారెల్ ధర ఇప్పుడు 108 డాలర్లకు చేరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. నాటో దేశాలకు అమెరికా ఇన్నాళ్లూ కొండంత అండగా నిలిచినా, ఇప్పుడు ఇరాన్ అణు ముప్పును అడ్డుకోవడంలో వారు వెనకడుగు వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసియా మార్కెట్లు అతలాకుతలం

హార్మూజ్ జలసంధి మూతపడటంతో చమురు మాత్రమే కాదు.. కంప్యూటర్ చిప్స్ తయారీకి వాడే హీలియం, ఎరువులకు కావాల్సిన సల్ఫర్ వంటి ముడిపదార్థాల సరఫరా నిలిచిపోయి ఆసియా మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. బ్రిటన్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు కేవలం ‘ఖండన ప్రకటన’లకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో ఇరాన్ దాడులను అడ్డుకోవడానికి ధైర్యం చేయడం లేదని ట్రంప్ ధ్వజమెత్తారు.