అమెరికా ఎఫ్35 జెట్ ను ఢీకొట్టినం.. వీడియో రిలీజ్  చేసిన ఐఆర్ జీసీ

అమెరికా ఎఫ్35 జెట్ ను ఢీకొట్టినం.. వీడియో రిలీజ్  చేసిన ఐఆర్ జీసీ
  • మా విమానం సేఫ్​గానే ల్యాండయిందన్న అమెరికా

టెహ్రాన్: ఇరాన్​తో యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ కు చెందిన ఎఫ్​35ఏ/బీ ఫైటర్ జెట్​ను ఢీకొట్టామని ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్​జీసీ) ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.50 గంటలకు తమ గగనతలంలోకి ప్రవేశించిన ఆ యుద్ధ విమానంపై దాడి చేశామని, మిసైల్ తో కూల్చివేసే ప్రయత్నంలో దానిని ఢీకొట్టామని పేర్కొంది. ఈ మేరకు ఐఆర్ జీసీ ఒక వీడియో రిలీజ్  చేసింది. కాగా..  ఇరాన్  మిసైల్  ఢీకొట్టిన వెంటనే ఆ ఫైటర్ జెట్ పశ్చిమాసియాలోని ఒక బేస్​లో అత్యవసరంగా ల్యాండ్  అయిందని అమెరికా సెంట్రల్  కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ తెలిపారు. ఫైటర్ జెట్ సేఫ్​గా ల్యాండ్  అయిందని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అయితే, తమ మిసైల్ ఢీకొన్న వెంటనే యుద్ధ విమానం కూలిపోయి ఉండొచ్చని ఇరాన్  చెబుతోంది. ఒకవేళ ఫైటర్ జెట్ కూలితే అమెరికాకు ఈ యుద్ధంలో మొదటిసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే.

పార్కులు, టూరిస్ట్ ప్లేస్​లపై దాడులు చేస్తాం..  

అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్, తన శత్రు దేశాలకు మునుపెన్నడూ లేని విధంగా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలు, వినోద కేంద్రాలు తమ శత్రువులకు ఇకపై ఏమాత్రం సురక్షితం కాదని ఇరాన్ మిలిటరీ అధికార ప్రతినిధి జనరల్ అబోల్ఫజల్ షేకర్చీ శుక్రవారం హెచ్చరించారు. దీంతో ఇరాన్ తన శత్రువులపై ఒత్తిడి తెచ్చేందుకు విదేశాల్లో ముఖ్యంగా అమెరికన్, ఇజ్రాయెల్ పౌరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.