టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ఆ దేశ అధికారిక మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ శుక్రవారం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మోజ్తబా కొందరు విద్యార్థులకు మతపరమైన బోధనలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోజ్తబా బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఆయన కేవలం లేఖల ద్వారానే సందేశాలు ఇచ్చారు. అయితే, ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం ఇరాన్ మీడియా స్పష్టం చేయలేదు.
ఫిబ్రవరి 28న తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన దాడిలోనే మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని.. కోమాలోకి కూడా వెళ్లారనే ప్రచారం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మోజ్తబా ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ విడుదల చేసిన వీడియో ఆ ఊహాగానాలను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది.
