ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వసూళ్ల పర్వం.. వచ్చిన సొమ్ముతో కార్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు.. సాయంత్రం అయితే జల్సాలు. వెయ్యి కాదు లక్ష కాదు.. ఏకంగా దాదాపు రెండు కోట్ల రూపాయలు వసూళ్లు చేసి మోసాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన నిందితుడు రఘురామ్ ను శనివారం (మార్చి 21) అరెస్ట్ చేశారు పోలీసులు. సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి కోట్లు స్వాహా చేశాడు. ఈ కేసులో రఘురామ్‌కు కోర్టు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో రిమాండ్ కు తరలించారు పోలీసులు.
రఘురామ్ మోసాలతో నష్టపోయిన బాధితులు సుమారు 60 మంది పైనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి దాదాపు రూ. 1.85 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. వసూలు చేసిన సొమ్ముతో ప్లాట్లు, కార్లు కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
