
- రష్యాతో కలిసి మరింత దిగజార్చుకుంటున్నారని విమర్శ
- పాకిస్తాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్టు ప్రకటన
- ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు వెలికితీస్తామని వెల్లడి
- ఏదో ఒకరోజు భారత్‌కు పాక్ ఆయిల్ విక్రయిస్తుందని వ్యాఖ్య
- రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని మన దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కసు
వాషింగ్టన్: ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషం చిమ్మారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ నోరుపారేసుకున్నారు. ఎకానమీని మరింత దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. భారత్, రష్యా మధ్య బంధాన్ని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. రష్యా నుంచి ఆయిల్, రక్షణ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు మన దేశాన్ని టార్గెట్ చేశారు. అమెరికాకు ఎగుమతి చేస్తున్న ఇండియా వస్తువులపై 25% టారిఫ్ సహా పెనాల్టీ విధిస్తున్నట్టు బుధవారం ప్రకటించిన ఆయన.. ఆ మరుసటి రోజు గురువారం భారత్, రష్యా టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఇండియా, రష్యావి డెడ్ ఎకానమీలు అని.. రెండు దేశాలు కలిసి వాళ్ల ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. మన దేశంపై టారిఫ్ యుద్ధానికి దిగిన ట్రంప్.. మన దాయాది పాకిస్తాన్‌తో మాత్రం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాక్‌తో ట్రేడ్ డీల్ పూర్తయిందని ప్రకటించారు. ఆ దేశంలో భారీ స్థాయిలో ఆయిల్ నిల్వలను వెలికితీస్తామని వెల్లడించారు.
ఏదో ఒక రోజు భారత్‌కు పాకిస్తాన్ ఆయిల్ అమ్మే రోజు రావొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్, రష్యా బంధంపై అక్కసు..
భారత్, రష్యా స్నేహ బంధంపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయంటూ నోరుపారేసుకున్నారు. ‘‘రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా నేనేం పట్టించుకోను. ఆ రెండు దేశాలు ఇప్పటికే పతనమైన తమ ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటున్నాయి. మేం భారత్‌తో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్లు ఎక్కువగా టారిఫ్‌లు వేస్తున్నారు. ప్రపంచంలో ఇండియానే అత్యధికంగా సుంకాలు విధిస్తున్నది” అని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్టు పెట్టారు. కాగా, తమ దేశంతో అమెరికా గేమ్ ఆడుతున్నదని, అది యుద్ధానికి దారితీయొచ్చని రష్యా మాజీ ప్రెసిడెంట్ దిమిత్రి మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. ‘‘రష్యా ప్రెసిడెంట్‌గా ఫెయిల్ అయిన దిమిత్రి మెద్వెదేవ్.. ఇప్పటికీ ఆ దేశ అధ్యక్షుడిగా ఫీల్ అవుతున్నారు. ఆయన ప్రమాదకరమైన భూభాగంలోకి ఎంటర్ అవుతున్నారు” అని హెచ్చరించారు.
పాక్‌తో ట్రేడ్ డీల్..
పాకిస్తాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంలోని ఆయిల్ నిల్వలను వెలికితీస్తామని వెల్లడించారు. ‘‘పాకిస్తాన్‌తో ఇంతకుముందే ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. ఆ దేశంలోని భారీ ఆయిల్ నిల్వలను వెలికితీసేందుకు పాక్‌తో కలిసి పని చేస్తాం. ఇందుకు అవసరమైన ఆయిల్ కంపెనీని ఎంపిక చేసే పనిలో ఉన్నాం. ఎవరికి తెలుసు.. ఏదో ఒక రోజు భారత్‌కు పాకిస్తాన్ ఆయిల్ విక్రయించొచ్చు” అని సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్టు పెట్టారు. అయితే పాక్‌లో భారీ ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పిన ట్రంప్.. అవి ఎక్కడ? ఎంత మేర ఉన్నాయనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. తమ దేశ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్నాయని గతంలో పాక్ ప్రకటించింది. కానీ వాటిని వెలికితీసే ప్రక్రియలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు.