V6 News

అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లేవ్..! పాక్ నుంచి తిరిగి వెళ్లిపోయిన అరాఘ్చీ

 అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లేవ్..! పాక్ నుంచి తిరిగి వెళ్లిపోయిన అరాఘ్చీ
  • అంతకుముందు పాక్ పీఎం షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ తో భేటీ
  •     ముఖాముఖి చర్చలకు ఎలాంటి ప్రణాళిక లేదన్న ఇరాన్  
  •     తమ ప్రతినిధుల పర్యటన రద్దు చేశానని ట్రంప్ ప్రకటన  
  •     చర్చలు కావాలంటే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చని సూచన 
  •     ఇస్లామాబాద్​లో రెండో విడత చర్చలు రద్దు    

ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య శనివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరగాల్సిన రెండో విడత ముఖాముఖి చర్చలు మొదలవకుండానే ఆగిపోయాయి. ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ బృందం శుక్రవారం రాత్రే ఇస్లామాబాద్​కు చేరుకోగా.. అమెరికా నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, పశ్చిమాసియా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ శనివారం ఇస్లామాబాద్ చేరుకుంటారని ముందుగా వైట్ హౌస్ ప్రకటించింది. కానీ, అరాఘ్చీ బృందం శనివారం సాయంత్రమే ఇస్లామాబాద్ నుంచి తిరిగి వెళ్లిపోయింది. పాక్ నుంచి బయలుదేరిన అరాఘ్చీ ఒమన్​కు చేరుకున్నారు. అంతకుముందు అరాఘ్చీ శనివారం పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఇతర ఉన్నతాధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం తిరిగి వెళ్లేముందు అమెరికా, ఇజ్రాయెల్​తో యుద్ధాన్ని ముగించడానికి తమ అధికారిక డిమాండ్ల జాబితాను పాకిస్తాన్ నాయకులకు ఆయన అందజేశారని అల్ జజీరా ప్రతినిధి తెలిపారు. పాక్​లో చర్చలకు అమెరికా ప్రతినిధులు వస్తున్నారని వైట్​హౌస్ ప్రకటించినా.. అమెరికాతో ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనే ప్రణాళికలేమీ లేవని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముందే స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ‘అధిక డిమాండ్లను’ టెహ్రాన్ అంగీకరించబోదని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి.

అమెరికాతో చర్చల ఊసెత్తని పాక్ పీఎం.. 

ఇస్లామాబాద్​లో శనివారం షరీఫ్​తో అరాఘ్చీ భేటీకి సంబంధించిన వీడియోను పాక్ పీఎంవో రిలీజ్ చేసింది. ‘ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితిపై అభిప్రాయాలను పంచుకున్నాం. పరస్పర ప్రయోజనకర విషయాలపై చర్చించాం’ అని పాక్ ప్రధాని చెప్పారు. కానీ, అమెరికాతో చర్చల గురించి ఆయన ప్రస్తావించలేదు. దీంతో ఇస్లామాబాద్​లో అమెరికా, ఇరాన్ రెండో విడత చర్చలపై అదే సందిగ్ధం నెలకొంది.

ఇరాన్ చేతిలో ఏమీ లేదు: ట్రంప్ 

పాక్ నుంచి అరాఘ్చీ బృందం వెళ్లిపోయిన నేపథ్యంలో తమ ప్రతినిధుల పర్యటనను రద్దు చేశానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన అధికారులు అక్కడకు వెళ్లి ‘ఏమీ లేని విషయాల గురించి కూర్చుని చర్చలు జరపడం’ తనకు ఇష్టం లేదన్నారు. పర్యటన రద్దయినంత మాత్రాన యుద్ధం మళ్లీ మొదలవుతుందని అర్థంకాదన్నారు. తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా కూడా ట్రంప్ స్పందించారు. ‘ప్రయాణాల కోసం చాలా టైం వృధా అవుతోంది. పని కూడా చాలా ఉంది!’ అని ఆయన రాశారు. ఇరాన్ నాయకత్వంలో ‘అంతర్గత విభేదాలు’ నెలకొన్నాయని విమర్శించారు. అసలు అక్కడ బాధ్యత ఎవరిదో ఇరానియన్లకే తెలియదన్నారు. అయితే, "అన్ని అవకాశాలు మా వద్దే ఉన్నాయి, వారి దగ్గర ఏమీ లేవు! వారు చర్చలు జరపాలనుకుంటే, చేయాల్సిందల్లా మాకు ఫోన్ చేయడమే!!" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


విమాన సర్వీసులు ప్రారంభించిన ఇరాన్


టెహ్రాన్: యుద్ధం కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులను ఇరాన్ పునరుద్ధరించింది. సుమారు రెండు నెలల తర్వాత శనివారం టెహ్రాన్‌‌‌‌లోని ఇమామ్ ఖమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి వాణిజ్య విమానాలు ఇస్తాంబుల్, మస్కట్ మదీనా నగరాలకు బయలుదేరినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేందుకు ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా ఇరాన్ ప్రభుత్వం తన దేశ గగనతలాన్ని మళ్లీ తెరిచేందుకు అంగీకరించింది. పరిస్థితులు కూడా కొంచెం సద్దుమణగడంతో విమానాలు ఎగిరేందుకు కూడా పర్మిషన్ ఇచ్చారు. అయితే.. కొన్ని దేశాలకు, కొన్ని నిర్ణీత మార్గాల్లో మాత్రమే ఫ్లైట్లకు అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇమామ్ ఖమేనీ ఎయిర్ పోర్ట్ నుంచి సర్వీసులను పునరుద్ధరించారు. మరోవైపు, ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ చేస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.