రష్యన్ ఆయిల్ కొనుగోళ్లకు ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌..! అమెరికా కొత్త ఆంక్షలతో రూట్ మార్చాలని చూస్తున్న ఇండియా

రష్యన్ ఆయిల్ కొనుగోళ్లకు  ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌..! అమెరికా కొత్త ఆంక్షలతో రూట్ మార్చాలని చూస్తున్న ఇండియా
  • రోజుకి 5 లక్షల బ్యారెల్స్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ కొనుగోళ్లను ఆపేయనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌
  • రోస్నెఫ్ట్‌‌‌‌, లుకోయిల్‌‌‌‌ నుంచి నేరుగా సరఫరా నిలిపేయనున్న ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు!

న్యూఢిల్లీ: ఇండియా తన రష్యన్ చమురు దిగుమతులను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా ప్రభుత్వం రష్యాకు చెందిన రెండు ప్రధాన చమురు కంపెనీలపై కొత్తగా  ఆంక్షలు విధించడంతో, వీటికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో భారత్‌‌‌‌ రోజుకు సగటున 1.7 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ క్రూడ్ ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం దేశీయ చమురు దిగుమతుల్లో 34 శాతం వాటాకు సమానం. యూఎస్ కొత్త ఆంక్షల వలన  రిలయన్స్ ఇండస్ట్రీస్ రోస్నెఫ్ట్‌‌‌‌తో కుదుర్చుకున్న సప్లయ్ ఒప్పందాన్ని తాత్కాలికంగా లేదా పూర్తిగా ఆపేసే అవకాశం కనిపిస్తోంది. 

ఈ కంపెనీ రోజుకు 5 లక్షల బ్యారెల్స్ రష్యన్ ఆయిల్‌‌‌‌ను రోస్నెఫ్ట్‌‌‌‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యన్ ఆయిల్ కొనడాన్ని సమీక్షిస్తున్నామని,  ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని రిలయన్స్ ప్రతినిధి రాయిటర్స్‌‌‌‌కు  తెలిపారు.  ఇండియన్ ఆయిల్, భారత్‌‌‌‌ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ సంస్థలు కూడా రోస్నెఫ్ట్‌‌‌‌, లుకోయిల్‌‌‌‌ నుంచి నేరుగా సరఫరా చేసుకోకూడదని నిర్ణయించుకున్నాయని,  తమ  ఆయిల్ ఒప్పందాలను తిరిగి పరిశీలిస్తున్నాయని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. 

రష్యన్ ఆయిల్ దిగుమతులు పూర్తిగా ఆగిపోవని, ఇతర కంపెనీల ద్వారా  కొంత సరఫరా కొనసాగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. అమెరికా, ఇండియా వాణిజ్య చర్చలపై తాజా చర్యలు  ప్రభావం చూపనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే భారతీయ వస్తువులపై 50 శాతం టారిఫ్‌‌‌‌లు విధించారు. అయితే ఇండియా–అమెరికా ఒప్పందం త్వరలో ఖరారవుతుందని,  భారత ఎగుమతులపై టారిఫ్‌‌‌‌లు 15–16 శాతానికి తగ్గే అవకాశం ఉందని తాజాగా వార్తాసంస్థ మింట్ రిపోర్ట్ చేసింది. ఎనర్జీ, వ్యవసాయం వంటి రంగాలు చర్చలలో కీలకంగా మారాయని పేర్కొంది. 

రష్యన్ కంపెనీలపై ఆంక్షలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ఆయిల్ కంపెనీలు రోస్నెఫ్ట్‌‌‌‌, లుకోయిల్‌‌‌‌పై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించారు. ఆస్తుల ఫ్రీజ్, లావాదేవీల నిషేధం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. ఈ ఆంక్షలు రష్యా చమురు ఎగుమతులలో సగానికి పైగా ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యన్ ఆయిల్ ఎగుమతుల్లో రోజుకు 3.1 మిలియన్ బ్యారెల్స్ వరకు తగ్గిపోవచ్చు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ నిర్లక్ష్యానికి ప్రతిస్పందనగా తీసుకున్నట్లు తెలిపారు. 

యూరోపియన్ యూనియన్ కూడా 19వ ఆంక్షల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో 2027 నాటికి రష్యన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌‌‌‌పై పూర్తి నిషేధం, రష్యా "షాడో ఫ్లీట్"కు చెందిన 100కు పైగా నౌకలపై నిషేధం, రష్యన్ డిప్లమాట్ల ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి.

చైనా కూడా ఆపేసింది?

అమెరికా రోస్నెఫ్ట్‌‌‌‌, లుకోయిల్‌‌‌‌పై ఆంక్షలు విధించడంతో చైనా ప్రభుత్వ చమురు సంస్థలు సముద్ర మార్గం ద్వారా రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను  తాత్కాలికంగా ఆపేశాయి. చైనా రోజుకు 1.4 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకుంటోంది.   ప్రభుత్వ సంస్థలు పెట్రోచైనా, సినోపెక్‌‌‌‌, సీఎన్‌‌‌‌ఓఓసీ, జెన్‌‌‌‌హూ వంటి కంపెనీలు  ఆంక్షల భయంతో వెనక్కి తగ్గాయి. సినోపెక్‌‌‌‌ ట్రేడింగ్ విభాగమైన యూనిపెక్‌‌‌‌ ఇప్పటికే కొనుగోళ్లు నిలిపివేసింది. 

రోస్నెఫ్ట్‌‌‌‌, లుకోయిల్‌‌‌‌  ఎక్కువగా మధ్యవర్తుల ద్వారా చమురు విక్రయిస్తాయి. ఇండియా, చైనా.. ఇతర దేశాల నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచుతుండటంతో, డిమాండ్ పెరిగి గ్లోబల్‌గా ఆయిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంది.