అణు యుద్ధాన్ని ఆపిన... భారత్, పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేసిన: ట్రంప్

అణు యుద్ధాన్ని ఆపిన... భారత్, పాక్  కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేసిన: ట్రంప్
  • లేదంటే వాణిజ్యం ఆపేస్తమని చెప్పిన

వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్  మధ్య అణుయుద్ధం రాకుండా అడ్డుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  చెప్పారు. ఆ రెండు దేశాలకు చాలా న్యూక్లియర్  వెపన్లు ఉన్నాయని, పరిస్థితి అణు యుద్ధం వరకూ దారితీసి ఉండేదన్నారు. ఒకవేళ అణుయుద్ధమే జరిగి ఉంటే, లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయేవారన్నారు. సోమవారం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్  కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేశామని తెలిపారు. ఆ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కోసం తాను జరిపిన దౌత్యం ఫలించిందన్నారు. 

రెండు దేశాలు అన్ని రకాల కాల్పుల విరమణకు ఒప్పుకోవడం సంతోషకరమని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్, పాక్  గొప్ప విజ్ఞత ప్రదర్శించాయని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో యూఎస్  ట్రేడ్  కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. ‘‘సీజ్ ఫైర్ కు ఒప్పుకుంటేనే మీతో ట్రేడింగ్  చేస్తామని భారత్, పాక్ కు స్పష్టం చేశాను. 

యుద్ధం ఆపకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడింగ్  ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పాను. ఇక ఆ రెండు దేశాల మధ్య శాంతి కోసం యత్నించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి మార్కో రుబియోకూ థ్యాంక్స్  చెబుతున్నా” అని ట్రంప్  వ్యాఖ్యానించారు.