యూఎస్ టారిఫ్ల డబ్బు వాపసు వచ్చేనా ? బిలియన్ డాలర్ల ప్రశ్న

యూఎస్ టారిఫ్ల డబ్బు వాపసు వచ్చేనా ? బిలియన్ డాలర్ల ప్రశ్న
  • బకాయిల విలువ 133 బిలియన్​ డాలర్లు
  • చెల్లింపునకు చాలా చిక్కులు
  • ఇచ్చినా 18 నెలల వరకు పట్టే చాన్స్​

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన  భారీ దిగుమతి సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన సంచలన తీర్పు అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక ఎజెండాకు పెద్ద దెబ్బ. గతేడాది జనవరిలో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ టారిఫ్​లను ప్రకటించారు.

గతేడాది ఆగస్టు నుంచి ఇవి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చాయి. అయితే వీటి ద్వారా ఇప్పటికే వివిధ దేశాల ఎగుమతిదారుల నుంచి వసూలు చేసిన 133 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11.17 లక్షల కోట్లు) భారీ పన్ను సొమ్ము భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

చట్టవిరుద్ధంగా సేకరించిన ఈ మొత్తాన్ని తిరిగి ఎలా చెల్లించాలనే విషయంపై కోర్టు తన తీర్పులో ఏమీ చెప్పలేదు. దిగుమతిదారులు ఈ డబ్బును వెనక్కి ఇవ్వాలని కోరుతున్నా, అది కష్టమని న్యాయ నిపుణులు అంటున్నారు. రీఫండ్ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

రెండంకెల టారిఫ్​ విధింపు
ట్రంప్ ​గద్దెనెక్కిన తరువాత దాదాపు అన్ని దేశాల ఉత్పత్తులపై రెండంకెల పన్నులను విధించారు. దిగుమతులపై పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్​కు మాత్రమే ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ చట్టం అధ్యక్షుడికి అటువంటి అధికారాలను ఇవ్వబోదని తేల్చి చెప్పింది. 

గత డిసెంబర్ మధ్య నాటికి ఐఈఈపీఏ టారిఫ్​ల రూపంలో యూఎస్ కస్టమ్స్ ఏజెన్సీ  133 బిలియన్​ డాలర్లు వసూలు చేసింది. వ్యాపార సంస్థలు ఈ భారాన్ని వినియోగదారులపై వేసినప్పటికీ రీఫండ్ సొమ్ము మాత్రం నేరుగా ఆయా కంపెనీలకే వెళ్లే అవకాశం ఉంది. బిలియన్ల కొద్దీ సొమ్మును తిరిగి ఇచ్చే విధానంపై కోర్టు మౌనం వహించడం వల్ల భవిష్యత్తులో గందరగోళం ఏర్పడుతుందని కోర్టు తీర్పును వ్యతిరేకించిన న్యాయమూర్తి  బ్రెట్ కావనాగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక్కో కుటుంబానికి రూ.145 లక్షలు ఇవ్వండి
 టారిఫ్​ల వల్ల తమకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఇలినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్​కర్ తన రాష్ట్రంలోని 51 లక్షల కుటుంబాల తరపున ఈ పన్నుల వాపసును డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబంపై ఈ టారిఫ్​ల వల్ల సగటున 1,700 డాలర్ల (దాదాపు రూ.1.45 లక్షలు) భారం పడిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తం 8.7 బిలియన్​ డాలర్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

నెవాడా ట్రెజరర్ జాక్ కోనిన్ కూడా  2.1 బిలియన్​ డాలర్ల రీఫండ్ కోసం దరఖాస్తు చేశారు. కాస్ట్​కో, రెవ్లాన్, బంబుల్ బీ ఫుడ్స్ వంటి సంస్థలు ముందస్తుగానే కోర్టులను ఆశ్రయించాయి.  1990ల సమయంలో ఎగుమతి రుసుములను రద్దు చేసినప్పుడు రీఫండ్ ఇచ్చారు.  ఇంత పెద్ద మొత్తంలో వేల సంఖ్యలో దరఖాస్తులను ఒకేసారి పరిష్కరించడం పెద్ద సవాలు.  దిగుమతిదారులు రీఫండ్లు పొందే విధానాన్ని ట్రంప్​ ప్రభుత్వం సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉంది.

తీర్పును స్టడీ చేస్తున్నాం: కేంద్రం ప్రకటన
అమెరికా సుప్రీంకోర్టు దిగుమతి సుంకాలపై ఇచ్చిన తీర్పును, తదనంతర పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.  ఈ తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి వచ్చేలా 10 శాతం తాత్కాలిక దిగుమతి సుంకాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలు భారత్​పై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్రం వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్​తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో ఎటువంటి మార్పు ఉండబోదని ట్రంప్ భరోసా ఇచ్చారు. గతంలో భారత్ నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు ఉండగా, తాజా ప్రకటనతో అవి 10 శాతానికి పరిమితం కానున్నాయి.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తుది చర్చలు జరపడానికి భారత బృందం ఈనెల 23న వాషింగ్టన్ వెళ్లనుంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో అమెరికా భారత్​కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో భారత్ ఎగుమతులు 86.5 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 45.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అమెరికా భారత్ ఎగుమతుల్లో సుమారు 18 శాతం వాటా కలిగి ఉంది. అమెరికా తీసుకోబోయే తదుపరి చర్యల కోసం కేంద్రం వేచి చూస్తోంది.