
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించడం పట్ల స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చర్య అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలను దెబ్బతీస్తుందని చట్టసభ సభ్యులు, దౌత్యవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై టారిఫ్‌లు విధించకుండా.. భారత్‌ను మాత్రమే టార్గెట్ చేయడాన్ని ప్రతిపక్ష డెమోక్రాట్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ టారిఫ్‌లు అమెరికన్లనూ బాధపెడుతున్నాయని ఎక్స్ వేదికగా విమర్శిస్తున్నారు.
అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపకపోతే.. ట్రంప్ కూడా వెనక్కి తగ్గరని ఆయన ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ హెచ్చరించారు. అమెరికా తన దిగుమతి సుంకాలపై కఠిన వైఖరిని కొనసాగిస్తుందన్నారు. మరోవైపు అమెరికాతో టారిఫ్‌ల వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో కొనసాగుతున్న వివాదం రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాల్లో తాత్కాలిక దశ మాత్రమేనని తెలిపాయి. అమెరికా సుంకాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం లేదని, ఎగుమతిదారులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి.