ఖతార్పై మళ్లీ దాడి చేస్తే బీభత్సమే.. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ను పేల్చేస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్

ఖతార్పై మళ్లీ దాడి చేస్తే బీభత్సమే.. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ను పేల్చేస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్

ఖతార్  లిక్విఫైడ్  నేచురల్  గ్యాస్ (ఎల్ఎన్​జీ)పై మళ్లీ దాడి చేస్తే బీభత్సం సృష్టిస్తం. ఇరాన్​కు చెందిన విలువైన సౌత్ పార్స్  గ్యాస్ ఫీల్డ్ ను పేల్చేస్తం. ఆ దేశం ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో అటాక్  చేస్తం. ఖతార్​పై దాడులు ఆపితే మంచిది. మీరు దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ మీపై ప్రతిదాడులు చేయదు. మూర్ఖంగా ప్రవర్తించి దాడులు కొనసాగిస్తే మాత్రం ప్రతిదాడులు తప్పవు. ఆ పరిస్థితి రాకూడదనే నేను కోరుకుంటున్నా. ఇరాన్  భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మా బలగాలకు ఆదేశాలు ఇవ్వం. కానీ, ఖతార్  ఎల్ఎన్​జీపై మరోసారి దాడిచేస్తే మాత్రం మీపై భీకర దాడులకు ఆదేశాలు ఇవ్వడానికి నేను ఏమాత్రం వెనుకాడను. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్

వాషింగ్టన్: ఖతార్ లిక్విఫైడ్  నేచురల్  గ్యాస్ (ఎల్ఎన్  జీ) పై మళ్లీ దాడి చేస్తే, బీభత్సం సృష్టిస్తామని ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  హెచ్చరించారు. ఇరాన్ కు చెందిన విలువైన సౌత్ పార్స్  గ్యాస్ ఫీల్డ్ ను పేల్చేస్తామని, ఇరాన్  ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో అటాక్  చేస్తామని ఆయన వార్నింగ్  ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్  తన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. ‘‘మీరు (ఇరాన్) ఖతార్ పై దాడులు ఆపితే మంచిది. మీరు దాడులు చేయకుండా ఉంటే ఇజ్రాయెల్ మీపై ప్రతిదాడులు చేయదు. మూర్ఖంగా ప్రవర్తించి దాడులు కొనసాగిస్తే మాత్రం మేము భీకరంగా ప్రతిదాడులు చేస్తాం. 

ఇజ్రాయెల్ సాయం తీసుకోనో లేక సాయం తీసుకోకుండానే మీ సౌత్ పార్స్  గ్యాస్  ఫీల్డ్ ను పేల్చేస్తాం. ఆ పరిస్థితి రాకూడదనే నేను కోరుకుంటున్నా. ఇరాన్  భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ స్థాయి హింసకు మా బలగాలకు నేను ఆదేశాలు ఇవ్వదలచుకోలేదు. కానీ, ఖతార్  ఎల్ఎన్జీపై మరోసారి దాడిచేస్తే మాత్రం మీపై భీకర దాడులకు ఆదేశాలు ఇవ్వడానికి నేను ఏమాత్రం వెనుకాడను” అని ట్రంప్  పేర్కొన్నారు.

కాగా.. ఇరాన్ కు చెందిన సౌత్  పార్స్  ఎల్ఎన్జీపై అంతకుముందు ఇజ్రాయెల్  దాడి చేసింది. తర్వాత ఇరాన్  కూడా ఖతార్ లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్  ఫెసిలిటీస్ పై ప్రతిదాడి చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్  స్పందించారు. అయితే, ఇరాన్  గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్  దాడిచేసిన విషయం తమకు తెలియదని, ఆ మేరకు సమాచారం ఇవ్వకుండానే ఇజ్రాయెల్  దాడికి పాల్పడిందని ట్రంప్  చెప్పారు. పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించి ఇజ్రాయెల్  దాడిచేసి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ పై అతిపెద్ద దాడి చేస్తం: హెగ్ సెత్
ఇరాన్ పై గురువారం అతిపెద్ద దాడి చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి  పీట్ హెగ్ సెత్  అన్నారు. అమెరికా దయాదాక్షిణ్యాలపైనే యుద్ధం ముగింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. యుద్ధం ముగింపు విషయంలో అమెరికాదే తుది నిర్ణయమన్నారు. ఇప్పటివరకూ ఇరాన్ లో 7 వేల టార్గెట్లపై దాడి చేశామని, గురువారం జరిపే దాడి అతి భీకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఇరాన్  డిఫెన్స్  సిస్టమ్స్ ను నాశనం చేశామన్నారు. 

ఇరాన్ తో యుద్ధంలో చనిపోయిన సైనికుల మృతదేహాలు అమెరికాకు తిరిగి వచ్చాయని తెలిపారు.  వారి మృతదేహాలకు నివాళి అర్పించామన్నారు. సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా వారి కుటుంబ సభ్యులు కోరారని, సైనికుల త్యాగానికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెగ్ సేత్  వ్యాఖ్యానించారు.