మాకు టైమ్ వస్తది.. అప్పుడు చెప్తం మీ సంగతి: ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలపై ట్రంప్ ఫైర్

మాకు టైమ్ వస్తది.. అప్పుడు చెప్తం మీ సంగతి: ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలపై ట్రంప్ ఫైర్

వాషింగ్టన్: ఇరాన్‎పై యుద్ధానికి సహయ నిరాకరణ చేస్తోన్న మిత్ర దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్‎కు వ్యతిరేకంగా యుద్ధంలో సహయం చేయమంటే చేయరా అని తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. యుద్ధానికి వెళ్తున్న అమెరికా ఫైటర్ జెట్స్‎కు అనుమతి నిరాకరించిన ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ దేశాలపై ట్రంప్ సీరియస్ అయ్యారు.

యుద్ధ సామాగ్రితో వెళ్తోన్న విమానాలకు అనుమతి నిరాకరిస్తూ బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ ఏ మాత్రం సహకరించలేదని మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో మీరు వ్యవహరించిన తీరును గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. మాకు అవసరం ఉన్నప్పడు మీరు అండగా నిలువలేదు.. మీకు అవసరం ఉన్నప్పుడు కూడా అమెరికా సహయం చేయదని స్పష్టం చేశారు.

 యుద్ధంలో తమకు సహకరించిన దేశాలకు భవిష్యత్‎లో మేం కూడా ఎలాంటి సహయం చేయమని తేల్చి చెప్పారు. హార్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న మిత్ర దేశాలను మీ చావు మీరు చావండన్న మాదిరిగా మాట్లాడారు ట్రంప్. ఇరాన్‎పై యుద్ధంలో తమకు సహకరించని మిత్ర దేశాలకు చమురు ఇచ్చే ప్రసక్తే లేదని.. మీరే ధైర్యం కూడగట్టుకుని హార్మూజ్ జలసంధికి వెళ్లి మీకు కావాల్సింది తెచ్చుకోండని చురకలంటించారు. మాకు సహయం చేయనప్పుడు మీ కోసం మేం ఎందుకు రిస్క్ చేయాలని అసహనం వ్యక్తం చేశారు. 

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. కాదు కూడదు అని ముందుకెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు.

హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు, రవాణాకు ఆటంకం లేకుండా చూసేందుకు అమెరికా మిత్ర దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ పిలుపుకు ఆశించిన స్పందన రాలేదు. హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు చైనా నిర్ద్వందంగా తిరస్కరించింది.

బ్రిటన్ కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదు. యుద్ధం ఇప్పుడు ముగిస్తారో ముందు ట్రంప్ స్పష్టంగా చెప్పాలని యూరప్ కంట్రీస్ డిమాండ్ చేశాయి. ఇండియా అయితే ఈ అంశంపై రెస్పాండే కాకపోవడం గమనార్హం. దీంతో తమ మిత్రదేశాలపై ట్రంప్ నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సృష్టిస్తున్న అలజడిని అణచివేసేందుకు సైనిక సహకారం అందించని దేశాలను ఉద్దేశించి అత్యంత కఠినమైన పదజాలం వాడారు. మీరంతా పిరికివాళ్లు (కోవార్డ్స్).. క్లిష్ట సమయంలో మీరు చేసిన ఈ పనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అంటూ హెచ్చరించారు. అమెరికా అండ లేకపోతే నాటో కేవలం ఒక 'కాగితపు పులి' అని ఆయన ఎద్దేవా చేశారు.

చమురు ధరలు పెరిగిపోతున్నాయని ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్న మిత్రదేశాలు, ఆ ధరలను తగ్గించేందుకు అవసరమైన హార్మూజ్ జలసంధి పునరుద్ధరణలో మాత్రం చేతులు ముడుచుకు కూర్చున్నాయని ట్రంప్ మండిపడ్డారు. యుద్ధం మొదలవ్వకముందు 70 డాలర్లున్న బ్యారెల్ ధర ఇప్పుడు 108 డాలర్లకు చేరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. నాటో దేశాలకు అమెరికా ఇన్నాళ్లూ కొండంత అండగా నిలిచినా, ఇప్పుడు ఇరాన్ అణు ముప్పును అడ్డుకోవడంలో వారు వెనకడుగు వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.