అమెరికా, ఇరాన్ యుద్దానికి తాత్కాలికంగా బ్రేక్ పడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా మీడియా వేదికగా స్పందించారు. ఇది ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజు అని అన్నారు. మిడిల్ ఈస్ట్ లో కొత్త స్వర్ణయుగమని అభివర్ణించారు.
ట్రూత్ సోషల్ లోని ఒక పోస్టులో ఆయన ఇలా అన్నారు: “ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు! ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది, వారికి ఇక చాలు అనిపించింది! అలాగే, మిగతా అందరికీ కూడా!” హోర్ముజ్ జలసంధిలో రవాణా పునరుద్ధరణకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహాయం చేయనున్నాయి. దీనివల్ల ఎన్నో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి! భారీగా డబ్బు సంపాదించవచ్చు.. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించగలదు. మేము అన్ని రకాల సామాగ్రిని సమకూర్చుకుని, అంతా సవ్యంగా జరిగేలా చూసుకోవడానికి అక్కడే ఉంటాం.. అది జరుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అమెరికాలో మనం చూస్తున్నట్లే, ఇది మిడిల్ ఈస్ట్ లోనూ స్వర్ణయుగం కావచ్చు అని రాశారు.
ఇస్లామిక్ రిపబ్లిక్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని ట్రంప్ విధించిన గడువుకు కేవలం గంటన్నర ముందు కుదిరిన ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చి రెండు వారాల పాటు కొనసాగుతుంది..అయితే ఒప్పందాలు అమలు జరగకపోతే దాడులను పునఃప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా చూసేందుకు అమెరికా బలగాలు ఆ ప్రాంతంలోనే మకాం వేసి ఉంటాయని ట్రంప్ తెలిపారు.
