వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే అందుకున్నారు. గతేడాది భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. వాషింగ్టన్‌లో జరిగిన 'బోర్డ్ ఆఫ్ పీస్' కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.." ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్న టైంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు నేనే నేరుగా ఫోన్ చేశాను. యుద్ధం ఆపకపోతే 200 శాతం టారిఫ్స్ విధిస్తానని ఇరువురిని బెదిరించాను.
మీతో వ్యాపార సంబంధాలు పూర్తిగా తెంచుకుంటామని వార్నింగ్ ఇచ్చాను. ఇరుదేశాల ప్రధానులు నా బెదిరింపులకు లొంగిపోయారు. డబ్బు నష్టపోతామని తెలియగానే వెనక్కి తగ్గారు. ఎందుకంటే డబ్బు కంటే ఏదీ ముఖ్యం కాదు కదా. అలా.. అణు శక్తి దేశాలైన భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను. ఆపరేషన్ సిందూర్ టైంలో ఖరీదైన 11 జెట్ విమానాలు కూలిపోయాయి" అని వివరించారు. అదే వేదికపై ఉన్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి "ఒక్క నిమిషం నిలబడండి" అని కోరిన ట్రంప్.."భారత్, పాక్ మధ్య ఒప్పందం కుదిర్చి నేను 2.5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని మీరు గతంలో చెప్పారు కదా!" అంటూ షరీఫ్‌ను ప్రశ్నించారు.
దీంతో పాక్ ప్రధాని సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. గతంలో తాను 10 మిలియన్ల ప్రాణాలు కాపాడానన్న ట్రంప్.. ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 25 మిలియన్లకు పెంచేయడం గమనార్హం.గతంలో 7 యుద్ధ విమానాలు మాత్రమే కూలిపోయాయని చెప్పుకొచ్చిన ట్రంప్.. ఈసారి వాటి సంఖ్యను 11కు పెంచారు. ట్రంప్ చేస్తున్న మధ్యవర్తిత్వ వాదనలను భారత్ తోసిపుచ్చుతూనే వస్తోంది. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ నేరుగా చర్చలు జరిపి కాల్పుల విరమణకు అంగీకరించారని స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో మూడో పక్షం జోక్యమే లేదని తేల్చి చెప్పింది.
