- ఆంక్షల జాబితాలో ఇండియా, చైనా
వాషింగ్టన్: రష్యాతో బిజినెస్ చేసే అన్ని దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపైనే ట్రంప్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. ఈమేరకు ఆంక్షలు విధించడానికి సంబంధించిన సెనేట్ చట్టానికి తాను మద్దతు ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఆంక్షల జాబితాలో రష్యా నుంచి పెద్దఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనా పేర్లు కూడా ఉన్నాయి. ఫ్లోరిడాకు బయల్దేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘రిపబ్లికన్లు సెనేట్‌లో ప్రవేశపెట్టబోయే ఒక కఠినమైన చట్టానికి నేను మద్దతు ఇస్తున్నాను. రష్యాతో వ్యాపారం చేసే ఏ దేశమైనా చాలా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ జాబితాలో ఇరాన్‌ను కూడా చేర్చే అవకాశం ఉంది. రష్యాతో ఎవరూ బిజినెస్ చేయొద్దు. అప్పుడే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేస్తుంది. రష్యాతో బిజినెస్ నడుస్తున్నంత కాలం.. ఉక్రెయిన్‌పై దాడులు జరుగుతూనే ఉంటాయి. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500% టారిఫ్‌లు విధిస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఆర్థిక వనరులను నిలిపివేయడం, ముఖ్యంగా రష్యా క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై ఒత్తిడి పెంచడం ఈ ఆంక్షల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు. ఇండియా, చైనాలే రష్యా నుంచి 70% చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేలా రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే మాస్కోతో వ్యాపారం చేస్తున్న దేశాలపై టారిఫ్‌ల తగ్గింపునకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
