సీజ్ ఫైర్ పొడిగింపుపై వీడని సస్పెన్స్...     హార్మూజ్ బ్లాకేడ్ పై తుది నిర్ణయం లేకుండానే మీటింగ్ క్లోజ్..

సీజ్ ఫైర్ పొడిగింపుపై వీడని సస్పెన్స్...     హార్మూజ్ బ్లాకేడ్ పై తుది నిర్ణయం లేకుండానే మీటింగ్ క్లోజ్..
  • ఇరాన్​ తో డీల్ పై వైట్ హౌస్​లో ట్రంప్ ప్రత్యేక మీటింగ్
  • తాము డీల్​కు అంగీకరించామన్నది అబద్ధమన్న ఇరాన్ 

టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్​తో కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం మధ్యాహ్నం వైట్​హౌస్​లో 2 గంటలపాటు ప్రత్యేకంగా ‘సిచ్యుయేషన్ రూమ్’ సమావేశం నిర్వహించిన ట్రంప్.. ఆ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటానని అంతకుముందు ప్రకటించారు. కానీ, డీల్​పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. 

ఇరాన్​తో కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ఒప్పందం ఖరారు అయిందని, దీనిపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవడమే మిగిలిందని శుక్రవారం ఈ సమావేశానికి ముందు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు. ఆ తర్వాత మీటింగ్​కు ముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందిస్తూ.. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగిస్తుందని, అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని(హార్మూజ్ బ్లాకేడ్​ను) ఉపసంహరించుకుంటుందని పేర్కొన్నారు. 

అణ్వాయుధ దేశంగా మారబోమనే షరతుకు ఇరాన్ అంగీకరించాలని, ఎటువంటి టోల్ వసూళ్లు విధించకుండా హార్మూజ్ జలసంధిని పరిమితులులేని రవాణా కోసం వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. ఇరాన్ శుద్ధిచేసిన యురేనియంను నాశనం చేయాలని అన్నారు. చర్చల తదుపరి దశకు వెళ్లే ముందు స్తంభింపచేసిన తమ ఆస్తుల నుంచి 12 బిలియన్ డాలర్లను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ.. తదుపరి నిర్ణయం తీసుకునేవరకు డబ్బు మార్పిడి జరగదన్నారు.

ఒప్పందం ఖరారు కాలేదన్న ఇరాన్ 

కాల్పుల విరమణ పొడిగింపుపై అమెరికాతో ఇంకా ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదని, ఇరుపక్షాల మధ్య సమాచార మార్పిడి కొనసాగుతోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి తెలిపారు. ఐఆర్‌‌‌‌ఐబీ టీవీకి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో బఘేయి మాట్లాడుతూ.. చర్చలలో ఇరాన్ ప్రస్తుత దృష్టి యుద్ధాన్ని ముగించడంపైనే ఉందన్నారు. “ఈ దశలో ఇరాన్ యురేనియంకు సంబంధించిన అంశాల వివరాలపై మేం మాట్లాడట్లేదు” అని ఆయన చెప్పారు. 

హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే అవకాశం గురించి స్పందిస్తూ.. జలసంధి భవిష్యత్తు నిర్వహణ ఇరాన్, ఒమన్‌‌‌‌లకు మాత్రమే సంబంధించినదన్నారు. ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ స్పందిస్తూ.. “మేం చర్చల ద్వారా కాకుండా క్షిపణుల ద్వారా రాయితీలను పొందుతాం” అని పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు మొహమ్మద్ రెజాయ్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగించడం, చర్చలలో మితిమీరిన డిమాండ్లు చేయడం ద్వారా ట్రంప్​ తనకు చర్చల పట్ల ఆసక్తి లేదని మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. 

ఒప్పందంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలను ట్రంప్ లేవనెత్తారని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది. ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ తన అణు పదార్థాలను నిర్వీర్యం చేయడం గురించి కూడా ప్రస్తావన లేదని వెల్లడించింది. “ఇరాన్‌‌‌‌కు చెందిన స్తంభింపచేసిన ఆస్తుల నుంచి 12 బిలియన్ డాలర్లను వెంటనే చెల్లించడమే ఒప్పందంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఆ చెల్లింపు జరిగితేనే ఇరాన్ తదుపరి చర్చలకు అంగీకరిస్తుంది” అని ఫార్స్ వివరించింది.