అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అమెరికాలోని ప్రజలకే నేరుగా ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవటానికి డబ్బు ఇవ్వాలంటూ ప్రతిపాదించారు రిపబ్లికన్లకు. ప్రస్తుతం ఈ అంశం అమెరికా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
అయితే ఈ విషయానికి సంబంధించి శనివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఒబామా హెల్త్‌కేర్ ప్లాన్ కింద ఇన్సూరెన్స్ కంపెనీలకు వెళ్తున్న బిలియన్ల డాలర్లను నేరుగా ప్రజలకు ఇవ్వాలని భావిస్తున్నట్లు ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. డబ్బు పీల్చే ఇన్షురెన్స్ కంపెనీల కంటే ప్రజలకు ఇవ్వటం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ సొమ్ముతో ప్రజలు తమకు అనువైన, మెరుగైన ఆరోగ్య సేవలను కొనుగోలు చేసుకోవచ్చని, అదనంగా కొంత డబ్బు కూడా మిగులుతుందని చెప్పారు.
ట్రంప్ సూచనతో రిపబ్లికన్లు సంతోషంగా కనిపిస్తుండగా.. మరోపక్క డెమోక్రాట్లు మాత్రం గందరగోళంలో ఉన్నారు. సబ్సిడీలు రద్దు అయితే 2 కోట్ల 40 లక్షల మంది అమెరికన్లు హెల్త్ ఇన్సూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని డెమోక్రాట్స్ అంటున్నారు. ట్రంప్ మాత్రం ఒబామా కేర్ పథకం ప్రపంచంలోనే అత్యంత చెత్త హెల్త్ స్కీమ్ అని అన్నారు. ఇది ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పుకు దారి తీసే అవకాశముంది. కానీ, దీనికి కాంగ్రెస్ మద్దతు లభించగలదా అన్నది చూడాలి. వైట్ హౌస్ ఇంకా ఈ ప్రతిపాదనపై అధికారిక స్పందన ఇవ్వలేదు.
ఫెడరల్ ఉద్యోగులకు జీతం విడుదల చేసే బిల్లును శుక్రవారం తిరస్కరించిన తర్వాత.. అమెరికా చరిత్రలోనే ఎక్కువ కాలం కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌గా ఇది నిలిచింది. మరోవైపు రిపబ్లికన్లు మాత్రం ముందు ప్రభుత్వాన్ని తిరిగి ప్రారంభించాలని, ఆ తర్వాత అన్ని అంశాలను చర్చించవచ్చని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులు అమెరికా రాజకీయాల్లో విభజన మరింత స్పష్టమవుతోందని నిరూపిస్తోంది. అయితే ప్రపంచం మెుత్తం ప్రస్తుతం అమెరికా షట్ డౌన్ గురించే ఆందోళన చెందుతోంది.
