వైట్ హౌస్ పేపర్లను ట్రంప్ చింపేసిన్రు!

వైట్ హౌస్ పేపర్లను ట్రంప్ చింపేసిన్రు!

వాషింగ్టన్:  అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై మరో దుమారం రేగింది. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వైట్ హౌస్ లోని కీలక డాక్యుమెంట్లను చింపేశారని, పేపర్ ముక్కలను టాయిలెట్ లో వేసి ఫ్లష్​ చేశారంటూ ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక గురువారం సంచలన కథనం పబ్లిష్​చేసింది. ట్రంప్ డాక్యుమెంట్ల చించివేతకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని న్యాయ శాఖకు నేషనల్ ఆర్కైవ్స్ ఫిర్యాదు కూడా చేసినట్లు వెల్లడించింది.  ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడు ట్రంప్ తరచూ వైట్​హౌస్​లోని పేపర్లను చింపేసేవారని ఆ పత్రిక తెలిపింది. ట్రంప్ చింపేసిన కొన్ని డాక్యుమెంట్లను అధికారులు చాలా కష్టపడి అతికించారని వెల్లడించింది. ప్రెసిడెన్షియల్ రికార్డులను సేఫ్​గా ఉంచడం ప్రెసిడెంట్ బాధ్యత అని, కానీ కీలకమైన ప్రభుత్వ డాక్యుమెంట్ల నిర్వహణలో ఆయన ఫెయిల్ అయ్యారని పేర్కొంది. ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ లో 15 బాక్స్​లలో ఫెడరల్ డాక్యుమెంట్లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని ప్రెసిడెన్షియల్ రికార్డులను భద్రపర్చే నేషనల్ ఆర్కైవ్స్ సోమవారం ప్రకటించింది. దీంతో ట్రంప్ మరోసారి వివాదానికి సెంటర్ పాయింట్ అయ్యారు. 

న్యాయ విచారణ తప్పదా? 
వైట్ హౌస్ పేపర్లను ట్రంప్ చింపేయడం, వాటి నిర్వహణలో నిర్లక్ష్యం చూపడంపై న్యాయ విచారణ జరిగే అవకాశం ఉందా? అంటే.. కొందరు ఎక్స్ పర్ట్​లు ఉందని, మరికొందరు లేదని చెప్తున్నారు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్, 1978 ప్రకారం.. అమెరికా ప్రెసిడెంట్లు తమకు వచ్చే అన్ని ఈ మెయిల్స్, లెటర్స్, ఇతర వర్క్ డాక్యుమెంట్లను నేషనల్ ఆర్కైవ్స్ కు ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ ఆరోపణలపై ట్రంప్ స్పందిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని గురువారం ప్రకటించారు. తనపై మీడియాలో వచ్చిన కథనాలు అబద్ధమని స్పష్టం చేశారు.